కొవిడ్ వేళ సాయానికి ముందుకొచ్చిన పాండ్యా బ్రదర్స్

02-05-2021 Sun 06:32
  • దేశంలో వేధిస్తున్న ఆక్సిజన్ కొరత
  • సకాలంలో ఆక్సిజన్ అందక మరణిస్తున్న రోగులు
  • 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విరాళంగా ప్రకటించిన పాండ్యా బద్రర్స్
Pandya brothers and family donate 200 Oxygen Concentrators

దేశంలో విచ్చలవిడిగా కరోనా వైరస్ చెలరేగిపోతున్న వేళ ఆక్సిజన్ కొరత కారణంగా పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న ప్రతి చోటు నుంచి ప్రభుత్వం ఆక్సిజన్‌ను తెప్పిస్తూ ఆసుపత్రులకు సరఫరా చేస్తోంది. అయినప్పటికీ ఇంకా కొరత వేధిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పలువురు క్రికెటర్లు కూడా సాయానికి ముందుకొస్తున్నారు.

టీమిండియా ఆటగాడు, ఢిల్లీ కేపిటల్స్ బ్యాట్స్‌మన్ అజింక్య రహానే ఇటీవల 30 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విరాళంగా ఇచ్చాడు. తాజాగా, క్రికెట్ బ్రదర్స్ హార్దిక్ పాాండ్యా, కృనాల్ పాండ్యాలు కూడా ముందుకొచ్చారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందిస్తున్నట్టు నిన్న ప్రకటించారు. వీటి ద్వారా కొవిడ్ రోగులకు సకాలంలో ఆక్సిజన్ అందించి ప్రాణాలు నిలపవచ్చు.