ఇలాంటి ఘోరాలు చోటుచేసుకుంటున్నా ప్రభుత్వంలో చలనం లేదు: పవన్ కల్యాణ్

01-05-2021 Sat 22:10
  • కర్నూలులో ఆక్సిజన్ దొరక్క రోగుల మృతి అంటూ కలకలం
  • తీవ్రంగా స్పందించిన పవన్ కల్యాణ్
  • రాష్ట్రంలో పాలన ఉందా అంటూ విమర్శలు
  • సీఎం వ్యక్తిగత ప్రచారం మానుకోవాలని హితవు
  • ఆ నిధులను సౌకర్యాల కల్పనకు మళ్లించాలని సూచన
Pawan Kalyan fires in YCP govt

కర్నూలులో ఆక్సిజన్ అందక కరోనా రోగులు చనిపోయారన్న అంశంపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఆక్సిజన్ కొరతతో ఆరుగురు చనిపోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. కర్నూలులో రోగులు చనిపోయినట్టు భావిస్తున్న ఆసుపత్రికి అనుమతులు కూడా లేవని తెలిసిందని, పోలీసులు వెళ్లి తనిఖీ చేస్తే గానీ ఐసీయూలో రోగులు చనిపోయిన విషయం వెలుగులోకి రాలేదని వివరించారు. దీన్నిబట్టి అనుమతులు లేని ఆసుపత్రుల దందా ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ఆక్సిజన్ కొరతతో ఇంతటి ఘోరాలు జరుగుతున్నా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదని పవన్ కల్యాణ్ విమర్శించారు.

ప్రభుత్వాసుపత్రుల్లో సదుపాయాలు సమకూర్చడంపై ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో, రోగులు అనుమతుల్లేని ఆసుపత్రులకు వెళుతున్నారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం జగన్ వ్యక్తిగత ప్రచారానికి కోట్లు ఖర్చు చేయడం మాని, ఆ నిధులను వైద్య ఆరోగ్య శాఖలో సదుపాయాల కల్పనకు తరలించాలని హితవు పలికారు. పైగా రాష్ట్రంలో 104 సేవలు సరిగ్గా లేవని ప్రజలు గగ్గోలుపెడుతున్నారని, సాక్షాత్తు వైసీపీ ఎంపీ ఫోన్ చేస్తేనే 104 నుంచి స్పందన లేదని తెలిసిందని పేర్కొన్నారు.

ఆక్సిజన్ లేదు, బెడ్లు దొరకవు, 104 పనిచేయదు, అంబులెన్సులు రావు, రోగ నిర్ధారణ పరీక్షలు చేయరు... ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే రాష్ట్రంలో అసలు పాలన ఉందా అనే సందేహం కలుగుతోందని పవన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఏపీ సర్కారు పరీక్షలకు సిద్ధమవుతోందని, పది, ఇంటర్ పరీక్షలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ప్రభత్వం సమాధానం ఇవ్వాలని స్పష్టం చేశారు.