Lockdown: కఠిన లాక్‌డౌన్‌లు అమలు చేయాల్సిందే: ఎయిమ్స్‌ చీఫ్‌ గులేరియా

  • రాత్రి కర్ఫ్యూలు, వారాంతపు లాక్‌డౌన్‌లతో ప్రభావం లేదు
  • ఆక్సిజన్‌ అందక చనిపోవడం విచారకరం
  • నిర్లక్ష్య వైఖరి వల్లే కేసుల పెరుగుదల
  • ఢిల్లీలో ఆక్సిజన్‌ సరఫరాకు కేంద్రీకృత వ్యవస్థ
Strict lockdowns must be imposed says AIIMS Chief Guleria

కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో భారత్‌లో ఆరోగ్యసంరక్షణ వ్యవస్థల సామర్థ్యం తుది దశకు చేరుకుందని ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ గులేరియా తెలిపారు. పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో గత ఏడాది మార్చిలో విధించిన తరహాలో కఠిన లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం ఉందని ఎన్డీటీవీతో మాట్లాడుతూ అన్నారు.

కొన్ని రాష్ట్రాల్లో విధించిన రాత్రిపూట కర్ఫ్యూలు, వారాంతపు లాక్‌డౌన్‌లు ఏమాత్రం ప్రభావం చూపడం లేదని గులేరియా అభిప్రాయపడ్డారు. ఈరోజు ఆక్సిజన్‌ అందక ఢిల్లీలోని బాత్రా ఆసుపత్రిలో 12 మంది చనిపోయిన ఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కేసులు ఉద్ధృతంగా రావడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా కేసుల సంఖ్యను తగ్గించే దిశగా కఠిన చర్యలు అమలు చేయాలని నొక్కి చెప్పారు.

వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం, కేసుల తగ్గుముఖం పట్టడంతో భారతీయులు కొవిడ్‌ను తక్కువ అంచనా వేశారని గులేరియా తెలిపారు. ఢిల్లీలో ఆక్సిజన్‌ సరఫరాను పర్యవేక్షించేందుకు ఓ కేంద్రీకృత వ్యవస్థ ఉండాలని ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కోసారి కేసులు తారస్థాయికి చేరుకుంటాయని పేర్కొన్నారు.

More Telugu News