సీఐడీ విచారణ అంశాలు బయటికి ఎలా వచ్చాయి... హైకోర్టులో పిల్ వేస్తా: దేవినేని ఉమ

01-05-2021 Sat 21:19
  • దేవినేని ఉమను నేడు కూడా విచారించిన సీఐడీ
  • అనంతరం మీడియాతో మాట్లాడిన ఉమ
  • సీఐడీ విచారణ జరుగుతుంటే విజయసాయి ట్వీట్ చేశాడన్న ఉమ
  • విజయసాయిని విచారిస్తే బాగుండేదని వ్యాఖ్యలు
Devineni Uma talks to media after CID questioning

విజయవాడ సీఐడీ కార్యాలయంలో దాదాపు 9 గంటల పాటు ప్రశ్నల జడివానను ఎదుర్కొన్న అనంతరం టీడీపీ నేత దేవినేని ఉమ మీడియాతో మాట్లాడారు. సీఐడీ విచారణ అంశాలు ఎలా బయటికి వస్తున్నాయని ప్రశ్నించారు. దీనిపై తాను హైకోర్టులో పిటిషన్ వేస్తానని వెల్లడించారు. ఓవైపు విచారణ జరుగుతున్న సమయంలో విజయసాయిరెడ్డి ఎలా ట్వీట్ చేశారని నిలదీశారు. విజయసాయిరెడ్డి ఒక పెద్ద దొంగ అని, తనను సీఐడీ ముందు 9 గంటలు కూర్చోబెట్టే బదులు విజయసాయిరెడ్డిని కూర్చోబెడితే హూ కిల్డ్ బాబాయ్ ఎవరో తెలిసేదని ఎద్దేవా చేశారు.

రాజకీయ కక్షతోనే తనపై దుర్మార్గంగా కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని, తమను ఇబ్బందులకు గురిచేస్తున్న పోలీసులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని ఉమ స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే వారి సంగతి చూస్తామని హెచ్చరించారు. వారిని ఒడిశా, ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాలకు పంపిస్తామని స్పష్టం చేశారు.