Election commission: మద్రాస్‌ హైకోర్టు వ్యాఖ్యలు మమల్ని అవమానించేలా ఉన్నాయి.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఈసీ

ec reaches supreme court over Madras High court Murder comments
  • కొవిడ్‌ ఉద్ధృతిలో ఎన్నికలు నిర్వహించడంపై హైకోర్టు ఆగ్రహం
  • ఎన్నికల సంఘంపై ఘాటు విమర్శలు
  • హత్యాభియోగాల కింద కేసు నమోదు చేయాలని వ్యాఖ్య
  • కోర్టు వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ
దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 రెండో దశ ఉద్ధృతి కొనసాగుతున్న తరుణంలో పోలింగ్‌ నిర్వహించడంపై ఎన్నికల సంఘం(ఈసీ)పై ఇటీవల మద్రాస్‌ హైకోర్టు పదునైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సంబంధిత అధికారులపై హత్యాభియోగాల కింద కేసు నమోదు చేయవచ్చునని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యల్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. హైకోర్టు చేసిన వ్యాఖ్యలు అవమానించేలా ఉన్నాయని పేర్కొంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఓ రాజ్యాంగబద్ద, స్వతంత్ర సంస్థ అయిన హైకోర్టు మరో రాజ్యాంగబద్ధ, స్వతంత్ర సంస్థపై ఈ తరహాలో హత్యాభియోగాల వంటి తీవ్ర ఆరోపణలు చేయడం ఏమాత్రం సమంజసం కాదంటూ ఎన్నికల సంఘం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంలో పేర్కొంది. దీని వల్ల ఇరు సంస్థల ప్రతిష్ఠ దెబ్బతిందని వ్యాఖ్యానించింది.

కొవిడ్‌-19 విజృంభణకు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఈసీయే కారణమని ఏప్రిల్‌ 26న జరిగిన విచారణ సందర్భంగా మద్రాస్‌ హైకోర్టు వ్యాఖ్యానించింది.  ప్రస్తుత పరిస్థితులకు ఆ సంస్థదే బాధ్యతని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారులపై హత్యాభియోగాల కింద కేసు నమోదు చేయవచ్చునంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. వీటిని అవమానంగా భావించిన ఎన్నికల సంఘం తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Election commission
madras High court
Supreme court

More Telugu News