దేశంలో జీఎస్టీ రికార్డు... ఏప్రిల్ మాసానికి రూ.1.41 లక్షల కోట్ల వసూళ్లు

01-05-2021 Sat 20:02
  • మార్చి నెలలో రూ.1.23 లక్షల కోట్ల వసూళ్లు
  • 14 శాతం పెంపుతో ఏప్రిల్ వసూళ్లు
  • గత 7 నెలలుగా నిలకడగా జీఎస్టీ వసూళ్లు
  • లక్ష కోట్లకు పైగా వసూలవుతున్న వైనం
GST registers all time high in April

ఏప్రిల్ మాసానికి సంబంధించిన జీఎస్టీ వసూళ్ల వివరాలను కేంద్రం వెల్లడించింది. జీఎస్టీ ప్రవేశపెట్టిన తర్వాత ఎన్నడూ లేనంతగా ఏప్రిల్ నెలలో రూ.1.41,384 లక్షల కోట్ల మేర వసూళ్లు వచ్చినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మార్చి నెలలో రూ.1.23 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు కాగా, ఏప్రిల్ మాసానికి 14 శాతం అధికంగా వసూలైనట్టు వివరించింది. దిగుమతులతో కూడిన దేశీయ లావాదేవీలకు సంబంధించి మార్చితో పోల్చితే ఏప్రిల్ లో 21 శాతం అధికంగా వసూలైంది.

సీజీఎస్టీ వసూళ్లు రూ.27,837 కోట్లు కాగా, ఎస్జీఎస్టీ వసూళ్లు 35,621 కోట్లు అని కేంద్రం వెల్లడించింది. ఐజీఎస్టీ వసూళ్లు రూ.68,481 కోట్లు (దిగుమతులపై రాబట్టిన రూ.29,599 కోట్లతో కలిపి), సెస్ రూ.9,445 కోట్లు (దిగుమతులపై రాబట్టిన రూ.981 కోట్లతో కలిపి) వసూలైనట్టు వివరించింది.

గత ఏడు నెలలుగా దేశంలో జీఎస్టీ వసూళ్లు నిలకడగా లక్ష కోట్లు దాటుతున్నాయి. అంతేకాదు, నికర పెరుగుదలతో దేశ ఆర్థిక వ్యవస్థలో పునరుత్తేజం కలిగిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.