ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు... కొత్తగా 19,412 మందికి పాజిటివ్

01-05-2021 Sat 19:42
  • అంతకంతకు పెరుగుతున్న కొత్త కేసులు
  • జిల్లాల్లో ఉద్ధృతంగా కరోనా వ్యాప్తి
  • అధిక సంఖ్యలో నమోదవుతున్న మరణాలు
  • ప్రస్తుతం లక్ష మందికి పైగా చికిత్స
AP sees record level corona new cases

ఏపీలో ఏ రోజుకు ఆ రోజు అత్యధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే 17 వేలకు పైగా కేసులు నమోదైతే, ఇప్పటివరకు అదే రికార్డు అనుకుంటే, ఇవాళ వెల్లడించిన బులెటిన్ లో కొత్త కేసుల సంఖ్య 19 వేలు దాటింది. గడచిన 24 గంటల్లో ఏపీలో 98,214 కరోనా పరీక్షలు నిర్వహించగా... 19,412 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది.

అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,768 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 2,679 కేసులు, శ్రీకాకుళం జిల్లాలో 2,048 కేసులు నమోదయ్యాయి. కడప, కృష్ణా, విజయనగరం మినహా అన్ని జిల్లాల్లోనూ వెయ్యికి పైగా కొత్త కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 11,579 మంది కరోనా కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, 61 మంది కరోనాతో మృతి చెందారు. ఒక్క విజయనగరం జిల్లాలోనే 8 మంది మరణించారు.

ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు 11,21,102 పాజిటివ్ కేసులు నమోదు కాగా 9,82,297 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 1,30,752 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 8,053కి పెరిగింది.