దేశ రాజధాని ఢిల్లీలో మరో వారం పాటు లాక్ డౌన్

01-05-2021 Sat 18:14
  • ఇప్పటికే లాక్ డౌన్ లో కొనసాగుతున్న ఢిల్లీ
  • ఏమాత్రం మెరుగుపడని పరిస్థితి
  • గత 24 గంటల్లో 27 వేలకు పైగా కేసులు
  • 375 మంది మృత్యువాత
  • మరో వారం రోజులు లాక్ డౌన్ ఉంటుందన్న కేజ్రీవాల్
Lock down extended one week in Delhi

కరోనా మహమ్మారి గుప్పిట్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న దేశ రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్ పొడిగించారు. మరో వారం రోజులు ఢిల్లీలో లాక్ డౌన్ కొనసాగుతుందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ లో వెల్లడించారు. ఢిల్లీలో కరోనా పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయి. ఆక్సిజన్ దొరక్క కరోనా రోగులు మృత్యువాత పడడం కలవరపాటుకు గురిచేస్తోంది.

దీనిపై సీఎం కేజ్రీవాల్ స్పందిస్తూ, కరోనా రోగులు ఈ విధంగా మరణించడం బాధాకరమని పేర్కొన్నారు. ఢిల్లీకి ప్రస్తుత పరిస్థితుల్లో 976 టన్నుల ఆక్సిజన్ అవసరం కాగా, 312 టన్నులు మాత్రమే సరఫరా చేస్తున్నారని వెల్లడించారు. ఇంత తక్కువ స్థాయిలో ప్రాణవాయువు అందిస్తుంటే ఢిల్లీ ఎలా ఊపిరి పీల్చుకుంటుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

దేశ రాజధాని ఢిల్లీలో గత 24 గంటల్లో 27 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 375 మంది కరోనాకు బలయ్యారు. ఢిల్లీలో వరుసగా 13వ రోజు కూడా 20వేలకు పైగా కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. లక్ష వరకు యాక్టివ్ కేసులు ఉండడంతో దేశ రాజధానిలో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఆక్సిజన్ దొరక్క, బెడ్లు లేక... కరోనా బారినపడిన వారి బాధలు వర్ణనాతీతం.