Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు కాలం చెల్లిన వృద్ధ మాంత్రికుడిలా తయారయ్యారు: సజ్జల

  • సజ్జల ప్రెస్ మీట్
  • ఏపీలో సంక్షోభం నెలకొందని వెల్లడి
  • జగన్ నిబ్బరంగా ముందుకు వెళుతున్నారని వ్యాఖ్యలు
  • ఇతర రాష్ట్రాలు ఏపీ వైపు చూస్తున్నాయన్న సజ్జల
Sajjala slams Chandrababu

వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో పరిస్థితులపై మాట్లాడారు. సంక్షోభ సమయంలోనూ సీఎం జగన్ నిబ్బరంగా వ్యవహరిస్తూ ముందుకు వెళుతున్నారని వెల్లడించారు. ప్రజల అవసరాలను గుర్తిస్తూ తదనుగుణంగా పరిపాలన చేస్తున్నారని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. ప్రజల్లో సీఎం జగన్ పై ఉన్న విశ్వాసం ఇటీవల ముగిసిన స్థానిక ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనిపించిందని, రేపు వెలువడే ఉప ఎన్నిక ఫలితాల్లోనూ అదే తీరు వెల్లడవుతుందని సజ్జల ధీమా వ్యక్తం చేశారు.

కరోనా సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరంగా ఉందని, ఏపీలో లాక్ డౌన్ విధించాలన్న వాదనలు వినిపిస్తున్నాయని వెల్లడించారు. కానీ లాక్ డౌన్ ఇప్పటిపరిస్థితుల్లో వీలుకాదని సీఎం జగన్ తో పాటు ప్రభుత్వం కూడా భావిస్తోందని అన్నారు. లాక్ డౌన్ విధిస్తే ఏపీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంటుందని అభిప్రాయపడ్డారు. నాడు కరోనాతో సహజీవనం తప్పదని సీఎం జగన్ చెబితే కొందరు నవ్వారని, కానీ కరోనాతో కలిసి ప్రస్థానం సాగించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయని సజ్జల స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సజ్జల టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. "ఈ రాష్ట్రంలోకి రావాలంటేనే భయపడుతున్న చంద్రబాబు ఎక్కడో కూర్చుని మాట్లాడుతున్నాడు. జానపద సినిమాల్లో మాదిరే గుహల్లో కూర్చుని క్షుద్రపూజలు చేసే మాంత్రికుడిలా చంద్రబాబు తయారయ్యారు. హైదరాబాదు నుంచి చంద్రబాబు నుంచి చీడపీడల్లా వచ్చే సందేశాలను ఓ వర్గం మీడియా రసగుళికల్లా మార్చి ప్రజలపై గుమ్మరిస్తోంది. చంద్రబాబు తన వ్యాఖ్యలతో ఉద్యోగులను, విద్యార్థులను రెచ్చగొడుతున్నారు.

కరోనా సంక్షోభ సమయంలో రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సింది పోయి, చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. జూమ్ యాప్ లో కూర్చున్న కాలం చెల్లిన వృద్ధ మాంత్రికుడిలా అనిపిస్తున్నారు. అలా కాకుండా, రాష్ట్రానికి వచ్చి ప్రజలను కరోనాపై మరింత చైతన్య పరిచే కార్యక్రమాలు చేపట్టవచ్చు. తాను వయసు రీత్యా రాలేకపోతే కొడుకును పంపవచ్చు" అని సజ్జల పేర్కొన్నారు.

More Telugu News