ఇక్కడే ఉండిపోయిన ప్రకాశ్ రాజ్ .. ఇటలీలో ఆగిపోయిన షూటింగ్!

01-05-2021 Sat 17:06
  • విక్రమ్ కుమార్ నుంచి రానున్న 'థాంక్యూ'
  • చైతూ జోడీగా ముగ్గురు కథానాయికలు
  • కొన్ని రోజులుగా ఇటలీలో జరిగిన షూటింగ్

Thank You movie shooting stoped

నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థాంక్యూ' సినిమా రూపొందుతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ప్రేమకథా చిత్రంగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. 'దిల్' రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా రాశి ఖన్నా నటిస్తోంది. అవికా గోర్ .. మాళవిక నాయర్ కూడా తరువాత స్థానాల్లోని నాయికలుగా అలరించనున్నారు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూటింగు మొదలైంది. అప్పటి నుంచి చకచకా షూటింగు జరుపుకుంటూనే ఉంది.

కథ ప్రకారం ఇటలీలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించవలసి ఉంది. దాంతో ఈ సినిమా టీమ్ కొన్నిరోజుల క్రితం ఇటలీ వెళ్లింది. చైతూ కాంబినేషన్లోని సన్నివేశాల చిత్రీకరణ పూర్తయ్యే సమయానికి ప్రకాశ్ రాజ్ ఇక్కడి నుంచి ఇటలీ చేరుకోవలసి ఉంది. అయితే కరోనా ఉధృతంగా ఉన్న కారణంగా ఇటలీకి ఇండియా నుంచి వచ్చే విమానాలను నిలిపివేశారు. దాంతో ప్రకాశ్ రాజ్ అక్కడికి వెళ్లలేకపోయారు. ఫలితంగా అక్కడ షూటింగు ఆగిపోయినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమా టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.