అత్యంత బరువైన మామిడి కాయతో గిన్నిస్ రికార్డు స్థాపించిన కొలంబియా రైతులు

01-05-2021 Sat 16:51
  • గ్వాయత్ ప్రాంతంలో బాహుబలి మామిడి
  • బరువు 4.25 కిలోలు
  • ఇదే అత్యంత పెద్ద మామిడికాయగా గుర్తించిన గిన్నిస్ బుక్
  • ఇప్పటివరకు ఫిలిప్పీన్స్ మామిడి పేరిట రికార్డు
 Colombian farmers set Guinness record with huge mango

మామిడికాయను ఫలరాజు అనడంలో ఆశ్చర్యమేమీ లేదు. అత్యంత మధురంగా ఉండే దాని రుచికి ఫిదా అవని వారంటూ ఉండరు. సాధారణంగా మామిడికాయలు మహా అయితే 2 కిలోల వరకు బరువు తూగుతాయి. అది కూడా కొన్ని రకాల మామిడికాయలు మాత్రమే. కానీ, దక్షిణ అమెరికా ఖండంలోని కొలంబియా దేశ రైతులు మాత్రం అదిరిపోయే బరువుతో మామిడికాయలు సాగు చేసి ఔరా అనిపించారు.

కొలంబియాలోని గ్వాయత్ ప్రాంతం మామిడి తోటలకు ప్రసిద్ధి చెందినది. ఈ ప్రాంతానికి చెందిన జెర్మేన్ ఓర్లాండో బరేరా, రీనా మరియా అనే ఇద్దరు రైతులు ప్రపంచంలోనే అత్యంత బరువైన మామిడిని పండించారు. దీని బరువు 4.25 కిలోలు. ప్రపంచంలో ఇప్పటివరకు ఫిలిప్పీన్స్ కు చెందిన మామిడికాయ (3.435 కిలోలు) పేరిట ఉన్న రికార్డును కొలంబియా మామిడికాయ తిరగరాసింది.

దీనిపై కొలంబియా రైతుల జెర్మేన్ ఓర్లాండో మాట్లాడుతూ, కొలంబియా ప్రజలు ఎంతటి కష్టజీవులో ప్రపంచానికి తెలియజెప్పాలన్నది తమ అభిమతం అని వెల్లడించాడు. భూమిని అత్యంత ప్రేమతో సాగు చేస్తూ గొప్ప ఫలాలను పండిస్తుంటారని వివరించాడు. కాగా, గిన్నిస్ రికార్డును గ్వాయత్ ప్రాంత ప్రజలకు అంకితమిస్తున్నట్టు తెలిపాడు. గతంలో గ్వాయత్ ప్రాంతంలో 3,199 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సహజసిద్ధ ఫ్లవర్ కార్పెట్ ను తలపించేలా పువ్వులను సాగు చేసి తొలిసారి గిన్నిస్ రికార్డు నమోదు చేశారు.