వరుస ఓటముల నేపథ్యంలో కెప్టెన్ ను మార్చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్

01-05-2021 Sat 15:40
  • ఐపీఎల్ 14వ సీజన్ లో సన్ రైజర్స్ దారుణ వైఫల్యం
  • 6 మ్యాచ్ ల్లో 5 ఓటములు
  • కెప్టెన్ గా రాణించలేకపోతున్న డేవిడ్ వార్నర్
  • వార్నర్ పై విమర్శలు
  • కేన్ విలియమ్సన్ కు కెప్టెన్సీ అప్పగింత
Sunrisers Hyderabad changes captaincy after consecutive loses in ongoing IPL seacon

ఐపీఎల్ లో మెరుగైన రికార్డు కలిగివున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్ లో మాత్రం పరమచెత్తగా ఆడుతూ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడి ఒక్కదాంట్లో గెలిచింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది ఈ నేపథ్యంలో, కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ సామర్థ్యంపై సందేహాలు మొదలయ్యాయి. క్రికెట్ విమర్శకులు కూడా వార్నర్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది.

రేపు జరిగే మ్యాచ్ తో పాటు టోర్నీలో మిగిలిన మ్యాచ్ లకు ఇకపై సన్ రైజర్స్ జట్టుకు కేన్ విలియమ్సన్ నాయకత్వం వహిస్తాడని ప్రకటించింది. సన్ రైజర్స్ టీమ్ రేపు రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ నుంచే కెప్టెన్సీ మార్పు అమల్లోకి రానుందని, విదేశీ ఆటగాళ్ల కూర్పులో కూడా మార్పులు చేస్తున్నామని సన్ రైజర్స్ ఫ్రాంచైజీ ఓ ప్రకటనలో పేర్కొంది.

అయితే ఈ నిర్ణయం ఎంతో కఠినమైనదని, ఎన్నో ఏళ్లుగా డేవిడ్ వార్నర్ అందించిన సేవలు ఎనలేనివని తెలిపింది. ఇప్పుడు ఐపీఎల్ 14వ సీజన్ లో మిగిలిన మ్యాచ్ లకు ఓ ఆటగాడిగానూ వార్నర్ అదే రీతిలో సేవలు అందిస్తాడని భావిస్తున్నామని వివరించింది.