కరోనాతో మృతి చెందిన సినీ దర్శకుడు శ్రవణ్

01-05-2021 Sat 15:35
  • నిన్న రాత్రి తుదిశ్వాస విడిచిన డైరెక్టర్ శ్రవణ్
  • ఇటీవలి కాలంలో కరోనా బారిన పడిన వైనం
  • సకాలంతో చికిత్స అందకపోవడంతో మృతి
Tollywood director sravan dies with coron

కరోనా మహమ్మారి దెబ్బకు ఎందరో ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా మరో ప్రతిభావంతుడైన తెలుగు సినీ దర్శకుడు కరోనాకు బలయ్యారు. డైరెక్టర్ శ్రవణ్ గుండెపోటుతో కన్నుమూశారు. వరుణ్ సందేశ్ హీరోగా 'ప్రియుడు' అనే చిత్రాన్ని ఆయన తెరకెక్కించారు. పలు చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన శ్రవణ్... 'ప్రియుడు' చిత్రం విజయవంతం కాకపోవడంతో... ఆ తర్వాత కోడైరెక్టర్ గా, సినీ రచయితగా పని చేశారు.

కొన్ని రోజుల క్రితం శ్రవణ్ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆ తర్వాత తనలో కరోనా లక్షణాలు కనిపించినా అవి పోస్ట్ వ్యాక్సిన్ ప్రభావంతో వచ్చాయని ఆయన భావించారు. ఆ తర్వాత శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో, టెస్టులు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. కానీ, సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో.. నిన్న గుండెపోటుకు గురయ్యారు. రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రవణ్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు.