రామ్ చరణ్ నాకోసం చెఫ్ ను ఏర్పాటు చేయించాడు: అనసూయ

01-05-2021 Sat 15:24
  • రంగస్థలం జ్ఞాపకాలను స్మరించుకున్న అనసూయ
  • సెట్లో ఎక్కువగా చేపల కూర
  • తాను చేపలు తినేదాన్ని కాదని అనసూయ వెల్లడి
  • ఈ విషయం చరణ్ గుర్తించాడన్న అనసూయ
  • చెఫ్ ను పిలిపించి పనీర్ వంటకాలు చేయించాడని వివరణ
Anasuya recalls memories with Ramcharan

టెలివిజన్ యాంకర్ గా వినోదరంగంలోకి ప్రవేశించిన బబ్లీ బ్యూటీ అనసూయ, ఆ తర్వాత సినీ నటిగానూ బిజీ అయింది.. సినిమాల్లో ఆమెకు అంత క్రేజ్ రావడానికి కారణం రంగస్థలం సినిమానే. రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆ చిత్రంలో అనసూయ రంగమ్మత్త పాత్రలో ఒదిగిపోయింది. పల్లెటూరి యాసతో అభిమానులను విశేషంగా అలరించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రంగస్థలం చిత్రం షూటింగ్ నాటి ముచ్చట్లను పంచుకుంది.

ఆ సినిమా షూటింగ్ సందర్భంగా హీరో రామ్ చరణ్ తనకోసం ఎంతో శ్రద్ధ తీసుకున్నాడని వెల్లడించింది. సెట్లో ఎక్కువగా చేపల వంటకాలు ఉండేవని, అయితే తనకు చేపలు తినే అలవాటు లేకపోవడంతో ఇబ్బంది పడ్డానని అనసూయ చెప్పుకొచ్చింది. కానీ రామ్ చరణ్ తన ఇబ్బందిని గమనించి, వెంటనే ఓ చెఫ్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడని మురిసిపోయింది. పనీర్ తెప్పించి, దాన్ని చేపల కూర తరహాలో వండించేవాడని, దాంతో తాను హాయిగా భోజనం చేసేదాన్నని గుర్తుచేసుకుంది.

అప్పటికి రామ్ చరణ్ ఎంతో పెద్ద హీరో అని, తనలాంటి నటి కోసం అంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కూడా లేకపోయినా, ఎంతో మంచిమనసుతో స్పందించడం తనను ఆనందానికి గురిచేసిందని అనసూయ వివరించింది.