Arvind: తెలంగాణ క్యాబినెట్ లో ఎవరైనా పనిచేసే మంత్రి ఉన్నాడంటే అది ఈటల ఒక్కడే: ఎంపీ అరవింద్

  • ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలు
  • ఆరోగ్య మంత్రిత్వ శాఖ కేసీఆర్ కు బదలాయింపు
  • శాఖలేని మంత్రిగా ఈటల
  • కేసీఆర్ నీచ రాజకీయాలకు తెరలేపాడన్న అరవింద్
  • ఈటలకో న్యాయం, జూపల్లికో న్యాయమా అంటూ ఆగ్రహం
  • మైహోం రామేశ్వర్ రావు అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్
BJP MP Arvind opines on Eatala Rajender issue

భూకబ్జా ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్ నుంచి ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్ కు బదలాయించేందుకు గవర్నర్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. నిన్న ఒక్కసారిగా ఈటల భూకబ్జాలు అంటూ మీడియాలో వరుస కథనాలు రావడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు.

తెలంగాణ క్యాబినెట్ లో తనకు తెలిసినంతవరకు పనిచేసే మంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క ఈటల మాత్రమేనని అన్నారు. ఈటల ప్రజాదరణ క్రమంగా పెరుగుతుండడంతో ఓర్వలేకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కరోనా విజృంభిస్తున్న వేళ ఈటలపై కక్ష సాధింపుతో ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారని అరవింద్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఈటలకో న్యాయం... జూపల్లికో న్యాయమా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కు అంత చిత్తశుద్ధి ఉంటే మైహోం రామేశ్వరరావు అక్రమాలపై ఎందుకు  స్పందించడంలేదని నిలదీశారు.

ఏదేమైనా కేసీఆర్ నీచ రాజకీయాలకు తెరదీశాడని విమర్శించారు. ఈటలపైనే కాకుండా, భూ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్, తదితరులపైనా విచారణ జరిపించాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు. ఇక, ఈటల బీజేపీలోకి వస్తే స్వాగతిస్తారా అన్న ప్రశ్నకు బదులిస్తూ, అది పార్టీ హైకమాండ్ పరిధిలోని అంశమని అన్నారు.

More Telugu News