భారత్​ లో కొన్ని వారాలు లాక్​ డౌన్​ పెట్టాల్సిందే: ఆంటోనీ ఫౌచీ

01-05-2021 Sat 14:13
  • ఆక్సిజన్ సరఫరాను పెంచుకునే ఏర్పాట్లు చేయాలని సూచన
  • సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఓ గ్రూపును పెట్టాలని కామెంట్
  • వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని సూచన
US Top Epidemiologist Anthony Fauci Suggests Complete Lockdown in India for few weeks

కరోనాతో అల్లాడిపోతున్న భారత్ లో కొన్ని వారాల పాటు లాక్ డౌన్ విధించాల్సిందేనని అమెరికా ఎపిడెమియాలజిస్ట్ ఆంటోనీ ఫౌచీ అన్నారు. దేశంలో కరోనాను కట్టడి చేయాలంటే ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పదని తేల్చి చెప్పారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆక్సిజన్ సరఫరాను పెంచాలని, ఔషధాలు, పీపీఈ కిట్లను సమకూర్చుకోవాలని ఆయన సూచించారు. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఓ గ్రూపును ఏర్పాటు చేయాలని సూచించారు.

కరోనా కట్టడి కోసం త్వరిత నిర్ణయాలు తీసుకోవాలన్నారు. దీర్ఘకాలిక కట్టడి చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని దేశాలు తాము కరోనాపై గెలిచేశామంటూ ముందే సంబురాలు చేసుకుంటున్నాయని అన్నారు. చైనాలో ఏడాది క్రితం కేసులు మొదలైనప్పుడు మొత్తం లాక్ డౌన్ చేసేశారని, అయితే, ఆరు నెలల పాటు పూర్తిగా లాక్ డౌన్ విధించాల్సిన అవసరం లేదని చెప్పారు.

వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు తాత్కాలికంగా లాక్ డౌన్ పెడితే సరిపోతుందన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చాలా నిదానంగా సాగుతోందన్నారు. వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.