ధూళిపాళ్లను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు

01-05-2021 Sat 14:00
  • రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు తరలింపు
  • ఈనెల 5 వరకు ధూళిపాళ్లను విచారించనున్న అధికారులు
  • తండ్రిని చూసి కంటతడి పెట్టుకున్న ధూళిపాళ్ల కుమార్తె
ACB takes Dhulipala Narendra into custody

సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డారనే కేసులో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజు ఆయనను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు తరలించారు. ఈ నెల 5 వరకు ధూళిపాళ్లను ఏసీబీ అధికారులు విచారించనున్నారు.  

డెయిరీ అక్రమాలకు సంబంధించి ధూళిపాళ్లను మరింత లోతుగా విచారించాల్సి ఉందని... తమ కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో ఏసీబీ అధికారులు వేసిన పిటిషన్ ను నిన్న కోర్టు విచారించింది. ధూళిపాళ్లను కస్టడీకి అనుమతించింది.

మరోవైపు జైలు వద్ద ఉద్వేగభరితమైన సన్నివేశం చోటుచేసుకుంది. తన తండ్రిని చూసి ధూళిపాళ్ల కుమార్తె కంటతడి పెట్టారు. ఆయనతో మాట్లాడేందుకు ఆమె ప్రయత్నించగా... కారు అద్దం తెరిచేందుకు పోలీసులు నిరాకరించారు.