'ప్రాణాలే లేన‌ప్పుడు ఇక భ‌విష్య‌త్తు ఎక్క‌డ ఉంటుంది?'.. ఏపీలో క‌రోనా ప‌రిస్థితుల‌పై చ‌ంద్రబాబు ఆగ్ర‌హం

01-05-2021 Sat 13:38
  • క‌రోనా రెండో ద‌శ ఉద్ధృతితో అంద‌రూ భ‌య‌ప‌డే ప‌రిస్థితి
  • అనేక రంగాల వారు క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు
  • మొద‌టి నుంచీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌ట్లేదు
  • ప‌ది, ఇంట‌ర్ విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు జ‌రుపుతామ‌ని చెబుతోంది
  •  సంక్షోభాన్ని నివారించాల‌న్న ఆలోచ‌నే ప్ర‌భుత్వానికి లేదు
chandrababu slams jagan

క‌రోనా రెండో ద‌శ ఉద్ధృతితో అంద‌రూ భ‌య‌ప‌డే ప‌రిస్థితి ఉంద‌ని, అనేక రంగాల వారు క‌రోనాతో ప్రాణాలు కోల్పోతున్నార‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అన్నారు. అయిన‌ప్ప‌టికీ మొద‌టి నుంచీ ఏపీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌ట్లేదని ఆయ‌న విమ‌ర్శించారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ప‌ది, ఇంట‌ర్ విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు జ‌రుపుతామ‌ని చెబుతోందని, క‌రోనా బారిన‌ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌లో ఉన్నారని చెప్పారు.

క‌రోనా సంక్షోభాన్ని నివారించాల‌న్న ఆలోచ‌నే ప్ర‌భుత్వానికి లేదని, సుప్రీంకోర్టు ఆదేశాల‌ను సైతం ఉల్లంఘించే స్థాయికి వ‌చ్చారని విమ‌ర్శించారు. ప్రాణాలే లేన‌ప్పుడు ఇక భ‌విష్య‌త్తు ఎక్క‌డ ఉంటుంది? అని ఆయ‌న నిల‌దీశారు. రాష్ట్రంలో చోటు చేసుకునే ప్ర‌తి మ‌ర‌ణ‌మూ హత్య‌గా భావించాలని అన్నారు. క‌రోనాపై మాట్లాడితే కేసులు పెడుతూ బెదిరిస్తున్నార‌ని చెప్పారు. ప్రాణాలు పోయినా ఫ‌ర్వాలేదన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్పారు. శ్మ‌శానాల్లో అంత్య‌క్రియ‌ల కోసం క్యూలు క‌డుతున్నార‌ని ఆయ‌న చెప్పారు.  

మ‌రోవైపు, మేడే సంద‌ర్భంగా చంద్ర‌బాబు నాయుడు ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. 'కార్మికులు, అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఆవిర్భవించింది తెలుగుదేశం పార్టీ. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రన్న బీమా పథకం ద్వారా రెండున్నర కోట్ల మంది అసంఘటిత కార్మికులకు భరోసా కల్పించాం. వందలాది పరిశ్రమలను నెలకొల్పి లక్షలాదిమంది కార్మికులకు ఉపాధి కల్పించాం' అని చెప్పారు.

'పని లేని నాడు ఏ ఒక్క కార్మికుడు ఆకలితో ఉండరాదన్న లక్ష్యంతో అన్న క్యాంటీన్లను ఏర్పాటుచేశాం. నాటి కార్మిక సంక్షేమ పథకాలు ఏవీ ఇప్పుడు లేవు. జగన్ ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా రోడ్డున పడ్డ లక్షలాది భవన నిర్మాణ, అసంఘటిత కార్మికుల పక్షాన నిలబడి గత రెండేళ్లుగా పోరాడుతున్నాం' అని చంద్రబాబు అన్నారు.

'కరోనా వేళ అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న కార్మికులు, ఉద్యోగులకు అండగా నిలుస్తుంది తెలుగుదేశం. ఈ కష్ట సమయంలో కార్మికులకు టీకా మరియు మందులను ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. యావత్ శ్రామిక లోకానికి ప్రపంచ కార్మిక దిన శుభాకాంక్షలు' అని చంద్ర‌బాబు చెప్పారు.