కుదిరితే దసరాకి .. లేదంటే క్రిస్మస్ కి 'పుష్ప'?

01-05-2021 Sat 12:19
  • అడవి నేపథ్యంలో సాగే 'పుష్ప'
  • విభిన్నమైన పాత్రలు .. ఆసక్తికర మలుపులు
  • చాలావరకూ చిత్రీకరణ పూర్తి

Pushpa release date postponed

సుకుమార్ విభిన్నమైన కథలను తెరకెక్కిస్తూ వస్తున్నారు. ఎన్టీఆర్ తో విదేశాల నేపథ్యంలో 'నాన్నకు ప్రేమతో' సినిమాను రూపొందించిన ఆయన, చరణ్ తో 'రంగస్థలం' సినిమాను పూర్తి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించాడు. తాజాగా అల్లు అర్జున్ హీరోగా 'పుష్ప' సినిమాను అడవి నేపథ్యంలో రూపొందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, హీరోకి చెల్లెలి పాత్రలో ఐశ్వర్య రాజేశ్ కనిపించనుంది. ఇక ప్రతినాయకుడి పాత్రను ఫహాద్ ఫాజిల్ పోషిస్తున్నాడు.

ఈ సినిమాను ఆగస్టు 13వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా అప్పటికీ పూర్తిస్థాయి పనులు కాకపోవచ్చని అనుకుంటున్నారట. అందువలన కుదిరితే 'దసరా' బరిలోకి దింపాలనీ .. లేదంటే 'క్రిస్మస్' కానుకగా డిసెంబర్ లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇతర సినిమాల విడుదల తేదీలను బట్టి, ఈ విషయంలో ఇంకా మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదు. కానీ ప్రస్తుతమైతే ఈ విషయాన్ని గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. జూన్ నాటికి ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.