ఈటల అంశంపై ఎవరూ మాట్లాడవద్దు: నేతలకు టీఆర్ఎస్ ఆదేశాలు

01-05-2021 Sat 11:59
  • సంచలనం రేపుతున్న ఈటల భూకబ్జా వ్యవహారం
  • ఈటల అంశంపై ఫోన్ లో కూడా మాట్లాడవద్దని నేతలకు టీఆర్ఎస్ ఆదేశం
  • ఈటల ఇంటి వద్దకు భారీగా చేరుకుంటున్న అభిమానులు
TRS high command orders its leaders not to speak on Etela Rajender

తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. రైతుల నుంచి ఆయన బలవంతంగా భూములను లాక్కున్నారనే ఆరోపణలు వచ్చిన వెంటనే... ఆయనపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను నిన్న రాత్రి మీడియా ముఖంగా ఆయన ఖండించారు. తనకు అన్నిటికన్నా ఆత్మాభిమానమే ముఖ్యమని చెప్పారు. తాను తప్పు చేసినట్టు విచారణలో రుజువైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని అన్నారు.

మరోవైపు ఈటల అంశంపై పార్టీ నేతలు, శ్రేణులు మాట్లాడరాదని టీఆర్ఎస్ అధిష్ఠానం ఆదేశించింది. కనీసం ఫోన్ ద్వారా కూడా మాట్లాడవద్దని అల్టిమేటం జారీ చేసింది. మరోవైపు ఈటల నివాసం వద్దకు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. ఈటలకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు.