భారత్​ పై అమెరికా ట్రావెల్​ బ్యాన్.. వీరికి మినహాయింపు!

01-05-2021 Sat 11:51
  • విద్యార్థులు, విద్యావేత్తలు, జర్నలిస్టులపై ఆంక్షలు లేవు
  • ఉత్తర్వులు విడుదల చేసిన ఆ దేశ విదేశాంగ శాఖ
  • ఇతర దేశాలకు ఇచ్చిన మినహాయింపులే భారత్ కూ
  • పరిమిత సంఖ్యలోనే వీసాల జారీ
US Bans Travel From Covid Hit India See Who Are Exempted

భారత్ లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడంతో భారత్ పై అమెరికా ప్రయాణ నిషేధాన్ని విధించింది. మే 4 నుంచి ఈ ట్రావెల్ బ్యాన్ అమల్లోకి వస్తుందని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. అయితే, అందులో పలు వర్గాల వారికి మినహాయింపులు ఇస్తున్నట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. కొన్ని విభాగాలకు చెందిన విద్యార్థులు, విద్యావేత్తలు, విలేకరులకు ప్రయాణ నిషేధం నుంచి మినహాయింపులు ఉంటాయని స్పష్టం చేసింది.

బ్రెజిల్, చైనా, ఇరాన్, దక్షిణాఫ్రికాపై గతంలో ట్రావెల్ బ్యాన్ విధించినప్పుడు ఇచ్చిన మినహాయింపులనే భారత్ విషయంలోనూ ఇస్తున్నామని పేర్కొంటూ విదేశాంగ శాఖ మంత్రి టోనీ బ్లింకెన్ ఉత్తర్వులు ఇచ్చారు. వేసవి (ఫాల్) కాలంలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు, ముఖ్యమైన విభాగాల్లో మౌలిక వసతులను అందించే ఇతర వ్యక్తులకు అమెరికా వచ్చేందుకు అనుమతిస్తామని పేర్కొన్నారు.

అయితే, మహమ్మారి విజృంభణ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే వీసాలను ఇస్తామని, ఇంతకుముందే విధించిన ఈ పరిమితి ఇకపైనా కొనసాగుతుందని స్పష్టం చేశారు. వీసాకు సంబంధించిన విషయాలను దరఖాస్తుదారులు వారికి సమీపంలోని రాయబార లేదా దౌత్యకార్యాలయ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చని తెలిపారు. చదువుల కోసం వచ్చే విద్యార్థులు.. కాలేజీలు ప్రారంభమయ్యే నెల రోజుల ముందే రావొచ్చని, ఎఫ్ 1, ఎం 1 వీసాలకు అప్లై చేసిన స్టూడెంట్లు రాయబార కార్యాలయ వెబ్ సైట్ లో ఓ సారి చెక్ చేసుకోవాలని సూచించారు.