'గబ్బర్ సింగ్'ను రవితేజతో చేయాలనుకున్నాడట!

01-05-2021 Sat 11:54
  • 'తీన్మార్' ఫ్లాప్ తో బాధపడ్డాను
  • పవన్ ను అడగడానికి మొహమాట పడ్డాను 
  • ఆయనే పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చారు  

Bandla Ganesh decided to do Gabbar Singh with Raviteja at first

ఒక చిన్న నటుడి స్థాయి నుంచి పెద్ద నిర్మాతగా ఎదగడం బండ్ల గణేశ్ లో కనిపిస్తుంది. నిర్మాతగా ఆయన భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించాడు. ఆయన నిర్మించిన చిత్రాల్లో భారీ విజయాలను అందుకున్నవి ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ఒకటిగా 'గబ్బర్ సింగ్' కనిపిస్తుంది. తాజాగా ఈ సినిమా విషయాలను గురించి బండ్ల గణేశ్ చెప్పుకొచ్చాడు. "నేను నిర్మాతగా మారడానికి కారకులు పవన్ కల్యాణ్ .. అందువల్లనే ఆయనని నా దేవుడుగా చెబుతుంటాను. నన్ను పిలిచి మరీ అవకాశం ఇచ్చినవారాయన.

పవన్ కల్యాణ్ గారితో నేను 'తీన్మార్' సినిమాను నిర్మించాను .. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అనుకున్నాను. కానీ ఆ సినిమా పెద్ద ఫ్లాప్ అయింది. ఎందుకు ఆ సినిమా అంతగా ఫ్లాప్ అయిందనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. పవన్ కల్యాణ్ గారికి ఫ్లాప్ ఇచ్చినందుకు గిల్టీగా ఉండేది. మళ్లీ ఆయన డేట్స్ అడిగితే బాగుండదని భావించి, రవితేజతో 'గబ్బర్ సింగ్' చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాను. కానీ 'తీన్మార్' వలన నాకు వచ్చిన నష్టాన్ని పూడ్చడం కోసం, తనతో మరో సినిమా చేసుకోమని పవన్ కల్యాణ్ గారే చెప్పారు. దాంతో ఆయనతోనే 'గబ్బర్ సింగ్' చేశాను. ఆ సినిమా నుంచి ఇక వెనుదిరిగి చూసుకోలేదు" అని చెప్పుకొచ్చాడు.