అచ్చంపేట‌ భూముల‌పై విచార‌ణ షురూ... ఈట‌ల ఇంటికి భారీగా చేరుకుంటున్న అభిమానులు, కార్య‌క‌ర్త‌లు

01-05-2021 Sat 11:17
  • భూములు కబ్జాకు గురయ్యాయనే ఆరోప‌ణ‌లు
  • ఈట‌ల‌పై ఫిర్యాదు చేసిన రైతుల నుంచి వివ‌రాల సేక‌ర‌ణ‌
  • తూప్రాన్ ఆర్డీవో రామ్ ప్ర‌కాశ్ నేతృత్వంలో భూముల స‌ర్వే
  • ఈట‌ల ఫాంహౌస్ వద్ద మోహ‌రించిన పోలీసులు
etela suppoters reaches his home

మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని భూములు కబ్జాకు గురయ్యాయనే ఆరోప‌ణ‌ల‌పై దర్యాప్తు జరిపి సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్‌ ద్వారా తెప్పించి రిపోర్టు అందజేయాలని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్‌ కుమార్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించిన విష‌యం తెలిసిందే.  అసైన్డ్ భూములను తెలంగాణ మంత్రి ఈటల రాజేంద‌ర్ కాజేశారంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో దానిపై విచార‌ణ‌కు ఆదేశించారు.

దీంతో ఈ రోజు ఉద‌యమే అచ్చంపేట‌కు చేరుకున్న అధికారులు.. ఈట‌ల‌పై ఫిర్యాదు చేసిన రైతుల నుంచి వివ‌రాల‌ను సేక‌రిస్తున్నారు. తూప్రాన్ ఆర్డీవో రామ్ ప్ర‌కాశ్ నేతృత్వంలో భూముల స‌ర్వే కూడా కొన‌సాగుతోంది. అచ్చంపేట‌లో పోలీసులు భారీగా మోహ‌రించారు.

మంత్రి ఈట‌ల ఫాంహౌస్ వ‌ద్ద కూడా పోలీసులు మోహ‌రించ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు, శామీర్‌పేట‌లోని ఈట‌ల రాజేంద‌ర్ ఇంటి వ‌ద్ద‌కు అభిమానులు, కార్య‌క‌ర్త‌లు భారీగా చేరుకుంటున్నారు. ఈట‌ల‌కు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు.