'మిస్టర్ ఇండియా' మెడలిస్ట్ జగదీశ్ లాడ్ కరోనాతో మృతి

30-04-2021 Fri 20:37
  • వడోదరలోని ఓ ఆసుపత్రిలో మృతి చెందిన జగదీశ్ లాడ్
  • గత నాలుగు రోజులుగా ఆక్సిజన్ సపోర్ట్ తో ఉన్న బాడీ బిల్డర్
  • కెరీర్ లో ఎన్నో విజయాలను సాధించిన జగదీశ్
Mr India Jagadish Lad dies with Corona

బలహీనమైనవాళ్లనే కాదు అత్యంత బలమైన వారిని కూడా కరోనా మహమ్మారి అంతం చేస్తోంది. కండలు తిరిగిన, ఉక్కులాంటి శరీరం కలిగిన మిస్టర్ ఇండియా మెడలిస్ట్ జగదీశ్ లాడ్ కరోనాతో పోరాడి మృతి చెందారు. 34 ఏళ్ల జగదీశ్ గుజరాత్ లోని వడోదరలో ఈరోజు తుదిశ్వాస విడిచారు. అంతర్జాతీయ బాడీ బిల్డర్ అయిన జగదీశ్ గత నాలుగు రోజులుగా వడోదరలోని ఓ ఆసుపత్రిలో ఆక్సిజన్ సపోర్ట్ తో చికిత్స పొందుతున్నారు. జగదీశ్ కు భార్య, ఒక కూతురు ఉన్నారు.

ఎన్నో బాడీ బిల్డింగ్ పోటీల్లో ఆయన తన స్వరాష్ట్రం మహారాష్ట్రతో పాటు, ఇండియాకు ప్రాతినిథ్యం వహించారు. మిస్టర్ ఇండియా పోటీల్లో ఆయన కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ప్రపంచ బాడీ బిల్డింగ్ పోటీల్లో కూడా సిల్వర్ మెడల్ సాధించారు. తన కెరీర్ లో ఎన్నో విజయాలను సాధించారు. ఆయన మరణం పట్ల బాడీ బిల్డర్లందరూ సంతాపం ప్రకటిస్తున్నారు.