ధూళిపాళ్ల నరేంద్రకు ఏసీబీ కస్టడీ... అనుమతించిన కోర్టు!

30-04-2021 Fri 20:12
  • 4 రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు
  • న్యాయవాది సమక్షంలో విచారించనున్న ఏసీబీ అధికారులు
  • బెయిల్ పిటిషన్లపై విచారణను సోమవారానికి వాయిదా వేసిన కోర్టు
ACB Court permits ACB custody for Dhulipala Narendra

టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను 4 రోజుల ఏసీబీ కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. న్యాయవాది సమక్షంలో ఆయనను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. నరేంద్ర కస్టడీ విషయంపై ఈరోజు ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. ధూళిపాళ్ల తరపున న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణప్రసాద్ వాదనలు వినిపించారు.

ప్రస్తుతం సంగం డెయిరీ ప్రభుత్వం ఆధీనంలో ఉందని... ఈ నేపథ్యంలో ధూళిపాళ్లను విచారించాల్సిన అవసరం ఏముందని రామకృష్ణప్రసాద్ ప్రశ్నించారు. డెయిరీ ద్వారా ధూళిపాళ్ల వ్యక్తిగతంగా ఎలాంటి లబ్ధి పొందలేదని చెప్పారు. మరోవైపు, ఈ కేసుకు సంబంధించి కొన్ని అంశాలను విచారించాల్సి ఉందని ఏసీబీ లాయర్లు కోర్టుకు తెలిపారు. ఇంకోవైపు, ధూళిపాళ్ల బెయిల్ పిటిషన్లపై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.