ఏ పరిస్థితుల్లో విద్యార్థులకు పరీక్షలను నిర్వహిస్తున్నామో అందరికీ అర్థం కావాలి: జగన్

30-04-2021 Fri 19:35
  • పాస్ మార్కులు మాత్రమే వస్తే మంచి కాలేజీల్లో సీట్లు ఎలా వస్తాయి?
  • విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నాం
  • పరీక్షల నిర్వహణకు అందరి సహకారం కావాలి
Everyone should understand about condting exams says Jagan

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే పది, ఇంటర్ పరీక్షలను నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. పరీక్షలు నిర్వహించని రాష్ట్రాలు విద్యార్థులకు కేవలం పాస్ మార్కులను మాత్రమే ఇస్తున్నాయని చెప్పారు. కేవలం పాస్ మార్కులు మాత్రమే వస్తే వారికి మంచి కాలేజీల్లో సీట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. పరీక్షల్లో 70 శాతానికి పైగా మార్కులు వస్తేనే మంచి కాలేజీల్లో సీట్లు వస్తాయని తెలిపారు. పాస్ మార్కులతో బయటపడిన విద్యార్థుల 50 ఏళ్ల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకోవాలని చెప్పారు. విద్యార్థులకు ఉన్నతమైన భవిష్యత్తు ఉండాలనే ఆకాంక్షతోనే పరీక్షలను నిర్వహిస్తున్నామని తెలిపారు.

పరీక్షల నిర్వహణ వల్ల కలిగే ప్రయోజనాలను అందరికీ తెలియజేయాలని జగన్ చెప్పారు. కేరళలో నిన్ననే పదో తరగతి పరీక్లలు పూర్తయ్యాయని తెలిపారు. పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వ ఎలాంటి విధానాన్ని ప్రకటించలేదని చెప్పారు. నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలకే వదిలేసిందని తెలిపారు. పరీక్షలను రద్దు చేయడం చాలా సులభమని... నిర్వహణ చాలా బాధ్యతతో కూడుకున్నదని తెలిపారు. ఈ విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు, అధ్యాపకులు గుర్తించాలని అన్నారు. పరీక్షల నిర్వహణకు అందరి సహకారం కావాలని చెప్పారు. కరోనా నేపథ్యంలో పరీక్షలకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.