కరోనా కట్టడికి సైన్యానికి ప్రత్యేక ఆర్థిక అధికారాలు!

30-04-2021 Fri 19:34
  • రక్షణశాఖ కీలక నిర్ణయం
  • మూడు నెలల పాటు అమల్లో ఉండనున్న అధికారాలు
  • చికిత్స, క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం
  • వైద్య సామగ్రి సమకూర్చుకునే వెసులుబాటు
  • ఎలాంటి అనుమతులు అవసరం లేదు
Defence ministry granted emergency Financial powers to Armed forces

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి నేపథ్యంలో సైన్యం తన వంతుగా అనేక సహాయ కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సైనిక వర్గాలకు దన్నుగా నిలిచేందుకు కేంద్ర రక్షణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సైన్యానికి అత్యవసర ఆర్థిక అధికారాలు కట్టబెట్టింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వశాఖ కార్యాలయం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

తాజా అధికారాలతో కరోనా చికిత్సా కేంద్రాలు, క్వారంటైన్ కేంద్రాలు నెలకొల్పడం, కావాల్సిన వనరుల్ని సమకూర్చుకోవడం సహా ఇతర అత్యవసర చర్యలు ఎలాంటి అనుమతులు లేకుండా స్వతహాగా చేపట్టేందుకు సైన్యానికి అవకాశం లభిస్తుంది. ఇకపై కార్ప్స్‌/ఏరియా కమాండర్లు రూ.50 లక్షలు, డివిజన్‌/సబ్‌ ఏరియా కమాండర్లు రూ.20 లక్షల వరకు కరోనా కట్టడి చర్యలు, ఇతర సహాయక చర్యల నిమిత్తం వినియోగించేందుకు అధికారం ఉంటుంది.

ఈ అధికారాలు మే 1 నుంచి జులై 31 వరకు మూడు నెలల పాటు అమల్లో ఉంటాయి. గతంలో సైనిక వర్గాల్లోని వైద్యాధికారులకు కల్పించిన అత్యవసర అధికారాలను మరింత మందికి పొడిగిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ తొలి దశ విజృంభణ సమయంలోనూ కేంద్రం ఈ తరహా అధికారాలను కల్పించింది.