ఏపీలో కరోనా విలయతాండవం... కొత్తగా 17,354 మందికి పాజిటివ్

30-04-2021 Fri 19:05
  • గత 24 గంటల్లో 86,494 కరోనా పరీక్షలు
  • 17 వేలకు పైగా కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఇప్పటివరకు ఇవే అత్యధిక కేసులు 
  • చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 2,764 కేసులు
  • గుంటూరు జిల్లాలోనూ 2 వేలకు పైన కేసులు
  • రాష్ట్రంలో మరో 64 మంది మృతి
Corona intensifies heavily in AP

ఏపీలో కరోనా భూతం విలయతాండవం చేస్తోంది. సెకండ్ వేవ్ లో కొత్త కేసుల సంఖ్య  రెట్టింపవుతోందే తప్ప తగ్గుముఖం పట్టడంలేదు. గడచిన 24 గంటల్లో 86,494 కరోనా పరీక్షలు నిర్వహించగా 17,354 మందికి పాజిటివ్ అని తేలింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే ప్రథమం. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. మరికొన్ని జిల్లాల్లో వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రంలో 8,468 మంది కరోనా నుంచి కోలుకోగా, 64 మంది మృతి చెందారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,01,690కి చేరింది. ఓవరాల్ గా 9,70,718 మంది కోలుకోగా, ఇంకా 1,22,980 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 7,992కి పెరిగింది.