కరోనాకు రోగులకు మందులు రాసిస్తానంటూ పిటిషన్.. రూ. 10 లక్షల ఫైన్ విధించమంటారా? అని ప్రశ్నించిన సీజేఐ ఎన్వీ రమణ

30-04-2021 Fri 17:58
  • సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన కామర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్
  • కరోనాపై మీకున్న జ్ఞానం ఎంతని ప్రశ్నించిన సీజేఐ రమణ
  • కామర్స్ చదివిన వ్యక్తి కరోనా గురించి డాక్టర్లకు, శాస్త్రవేత్తలకు బోధిస్తాడా? అని ఆగ్రహం
Supreme Court fires on commerce person who seeks to prescribe corona medicines

కరోనా బాధితులకు మెడిసిన్స్ కు సంబంధించిన ప్రిస్క్రిప్షన్ ను రాసిచ్చేందుకు తనకు అనుమతివ్వాలంటూ పిటిషన్ వేసిన ఓ వ్యక్తిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కామర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఒక వ్యక్తి ఈ పిటిషన్ వేశాడు. అంతకు ముందే ఆయన వేసిన పిటిషన్ ను కలకత్తా హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో, అతను సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు.

ఈ పిటిషన్ ను విచారించిన చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సురేశ్ షాల ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇదొక పనికిమాలిన పిటిషన్ అని మండిపడింది. మీరు డాక్టరా? లేక శాస్త్రవేత్తా? అని ప్రశ్నించింది. తాను డాక్టర్ ను కాదని... కామర్స్ లో పీజీ చేశానని పిటిషనర్ సమాధానమిచ్చాడు.

దీంతో జస్టిస్ షా మాట్లాడుతూ, కరోనా పేషెంట్లకు ఏ మందులు ఇవ్వాలో డాక్టర్లకు తెలియదా? ఏ మందులు వాడాలో ప్రపంచానికంతా మీరే చెపుతారా? అని ప్రశ్నించారు. కామర్స్ చదివిన వ్యక్తి కరోనా గురించి డాక్టర్లకు, శాస్త్రవేత్తలకు బోధిస్తాడా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, కరోనా గురించి, దాని ట్రీట్మెంట్ గురించి మీకున్న జ్ఞానం ఎంతని ప్రశ్నించారు. కలకత్తా హైకోర్టు నిర్ణయం మీకు తృప్తిని కలిగించలేదా ఇంత దూరం వచ్చారని అడిగారు. మీకు రూ. 10 లక్షలు ఫైన్ విధించమంటారా? అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా పిటిషనర్ మాట్లాడుతూ... తాను నిరుద్యోగినని, టీచర్ గా చిన్న ఉద్యోగం చేసుకుంటున్నానని, అంత జరిమానా చెల్లించలేనని చెప్పాడు. వెయ్యి రూపాయలైతే చెల్లించగలనని విన్నవించాడు. దీంతో, సుప్రీంకోర్టు అతని పిటిషన్ ను డిస్మిస్ చేసింది. వెయ్యి రూపాయల జరిమానాను కలకత్తా హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది.