పాన్ ఇండియా మూవీ కోసం రెడీ అవుతున్న రానా!

30-04-2021 Fri 17:19
  • వాయిదాపడిన 'విరాటపర్వం'
  • సెట్స్ పై ఉన్న మలయాళ రీమేక్
  • ఆచంట గోపీనాథ్ తో భారీ బడ్జెట్ మూవీ

Rana Daaggubati Pan India Project

రానా కథానాయకుడిగా రూపొందిన 'విరాటపర్వం' సినిమా కోసం ఆయన అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఈ రోజున విడుదల కావలసి ఉంది. కానీ కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న కారణంగా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీ ఎప్పుడు అనేది తరువాత ప్రకటించనున్నారు. ప్రస్తుతం రానా .. 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ లో చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత రానా ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి.

రానా హీరోగా చేయనున్న ఈ సినిమాను సీహెచ్ రాంబాబుతో కలిసి ఆచంట గోపీనాథ్ నిర్మిస్తున్నాడు. ఈ కొత్త ప్రాజెక్టును గురించి తాజాగా ఆయన మాట్లాడారు. రానా కోసం ఒక విభిన్నమైన  కథను సిద్ధం చేయించాము. కథ.. కథనం చాలా కొత్తగా ఉంటాయి. రానా ఇంతవరకూ చేయని పాత్ర ఇది .. ఆయన చాలా కొత్తగా కనిపిస్తాడు. రానాకి ఈ కథ చాలా బాగా నచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మించనున్నాం. ప్రస్తుతం రానా చేస్తున్న సినిమా పూర్తికాగానే, మా ప్రాజెక్టుపైకి వచ్చేస్తాడు. దర్శకుడు ఎవరనే విషయంతో పాటు మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తాము" అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి పాన్ ఇండియా అంటూ రానా కూడా రంగంలోకి దిగిపోయాడన్న మాట.