104 సర్వీసుకు కాల్ చేసిన విజయసాయిరెడ్డి... అవతల నుంచి నో రెస్పాన్స్!

30-04-2021 Fri 16:02
  • ఏపీలో కరోనా బీభత్సం
  • 104 సేవలు సమర్థవంతంగా అందించాలన్న సీఎం జగన్
  • పరిశీలించేందుకు స్వయంగా ప్రయత్నించిన విజయసాయి
  • 20 నిమిషాల పాటు స్పందన లేకపోవడంతో అసహనం
  • 104 నిర్వాహకులపై ఆగ్రహం
  • సాంకేతిక లోపం తలెత్తిందన్న నిర్వాహకులు
Vijayasai Reddy disappoints after no response to his call

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో 104 కాల్ సెంటర్లు మరింత సమర్థవంతంగా పనిచేయాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో 104 సర్వీసుల పనితీరు ఎలా ఉందో పరిశీలించేందుకు ప్రయత్నించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. విజయసాయిరెడ్డి ఇవాళ ఓ 104 కేంద్రానికి స్వయంగా ఫోన్ చేశారు. అయితే దాదాపు 20 నిమిషాల వరకు అవతల వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో విజయసాయి అసహనానికి గురయ్యారు.

తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటన్న విజయసాయి... 104 నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతిక లోపాల కారణంగా ఈ సమస్య వచ్చిందని 104 నిర్వాహకులు విజయసాయికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కరోనా ఉద్ధృతంగా ఉన్నవేళ లోపాలు చక్కదిద్దుకుని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని విజయసాయి స్పష్టం చేశారు.