మహారాష్ట్రలో కరోనా మూడో వేవ్​ ముప్పు!

30-04-2021 Fri 13:44
  • హెచ్చరించిన ఆ రాష్ట్ర సీఎం, ఆరోగ్య మంత్రి
  • జులై లేదా ఆగస్టులో మొదలయ్యే చాన్స్
  • అప్పటికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశం
  • అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవాలని సూచన
  • ఆక్సిజన్ కొరతన్న మాటే రావొద్దని సీఎం సూచన
  • మే చివరి నాటికి కేసులు తగ్గుతాయన్న ఆ రాష్ట్ర కొవిడ్ టాస్క్ ఫోర్స్
Maharashtra in the grim phase of Third Wave to hit by July or August

కరోనా సెకండ్ వేవ్ ధాటికి చిగరుటాకులా వణికిపోతున్న మహారాష్ట్రకు మరో ముప్పూ పొంచి ఉందా? అంటే అవుననే అంటున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. జులై, ఆగస్టులో రాష్ట్రాన్ని కొవిడ్ మూడో వేవ్ ముంచెత్తే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. మూడో వేవ్ పై ఎపిడెమియాలజిస్టులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఈ నిర్ధారణకు వచ్చామన్నారు.

మూడో వేవ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి నుంచే అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అందుకు తగిన మౌలిక వసతులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితులు మళ్లీ పునరావృతం కావొద్దని తేల్చి చెప్పారు. జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా, మూడో వేవ్ వచ్చే నాటికి ఆక్సిజన్ నిల్వలకు సంబంధించి స్వయం సమృద్ధి సాధిస్తామని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపె చెప్పారు. అప్పటికి ఆక్సిజన్ కొరత రాకుండా చూసుకోవాలని, కొరత వచ్చిందన్న మాటే వినపడొద్దని సీఎం చెప్పారన్నారు. జులై నాటికి ఆక్సిజన్ మిగులు ఉండాలని అధికారులను ఆయన ఆదేశించారు. అందుకుగానూ 125 ప్రెజర్ స్వింగ్ అబ్జార్ప్షన్ టెక్నాలజీ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు పనులు మొదలు పెట్టాలని సూచించారు. రాబోయే పది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వాటి ఏర్పాటును ప్రారంభించాలన్నారు.

కాగా, మూడో వేవ్ వస్తుందని మహారాష్ట్ర ప్రభుత్వ కొవిడ్ టాస్క్ ఫోర్స్ లోని సభ్యులు హెచ్చరించారు. వివిధ దేశాల్లో కరోనా విజృంభణ తీరును పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. మే చివరి నాటికి కరోనా కేసులు తగ్గుముఖం పడతాయని, జులై ఆఖరున లేదా ఆగస్టు మొదటి వారంలో కరోనా మహమ్మారి మళ్లీ జూలు విదుల్చుతుందని పేర్కొన్నారు. థర్డ్ వేవ్ అప్పట్నుంచే మొదలవుతుందని పేర్కొన్నారు.