కరోనా విజృంభణకు ఎన్నికల ప్రచారమొక్కటే కారణం కాదు: కేంద్ర ఎన్నికల సంఘం

30-04-2021 Fri 11:56
  • మద్రాస్ హైకోర్టుకు వివరణ
  • ఎన్నికల వల్లే కేసులు పెరిగాయన్న కోర్టు
  • ఈసీపై హత్య కేసు పెట్టాలని తీవ్ర వ్యాఖ్యలు
  • ఆ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఎన్నికల సంఘం
  • తమిళనాట ఏప్రిల్ 4నే ప్రచారం ముగిసిందని వ్యాఖ్య
  • ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యల్లో అర్థం లేదన్న ఈసీ
  • మీడియా కథనాలతో పరువు పోతోందని అసహనం
  • కోర్టు వార్తలు కవర్ చేయకుండా అడ్డుకోవాలని విజ్ఞప్తి
No Suggestions That Campaigning Spreads Covid 19 Observes ECI

దేశంలో కరోనా విజృంభణకు ఎన్నికల ప్రచారం ఒక్కటే కారణం కాదని కేంద్ర ఎన్నికల సంఘం మద్రాస్ హైకోర్టుకు వివరణ ఇచ్చింది. ప్రచారం వల్లే కేసులు పెరిగాయని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలూ లేవని చెప్పింది. ఎన్నికల ప్రచారం వల్లే దేశంలో కేసులు పెరిగిపోతున్నాయని, ప్రచారానికి అనుమతిచ్చిన కేంద్ర ఎన్నికల సంఘంపై హత్య కేసు నమోదు చేయాలని గత సోమవారం మద్రాస్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈరోజు మద్రాస్ హైకోర్టులో ఈసీ వివరణ ఇచ్చింది.

కేసుల పెరుగుదలకు కేవలం ఎన్నికల సంఘాన్నే బాధ్యులను చేయడం కరెక్ట్ కాదని పేర్కొంది. కోర్టు వ్యాఖ్యలను మీడియా చానెళ్లు, పత్రికలు ఇష్టమొచ్చినట్టు ప్రసారం చేస్తున్నాయని, అలాంటి కథనాలు ప్రసారం చేయకుండా మీడియాకు అడ్డుకట్ట వేయాలని కోరింది. మీడియా కథనాల వల్ల ఎంతో బాధ్యతాయుతమైన కార్యకలాపాలు చేస్తున్న ఈసీ పరువు పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. మీడియా కథనాల ఆధారంగానే పశ్చిమ బెంగాల్ లో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ పై పోలీసులు కేసు నమోదు చేశారని పేర్కొంది.

కాబట్టి కోర్టు విచారణలను మీడియా కవర్ చేయకుండా చూడాలని కోరింది. వాస్తవానికి తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఎప్పుడో ఏప్రిల్ 4న పూర్తయిందని, కానీ, ఇప్పుడు మద్రాస్ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేయడంలో అర్థం లేదని వ్యాఖ్యానించింది. ఆదివారం జరగబోయే ఓట్ల లెక్కింపునకు సంబంధించి తీసుకున్న చర్యలపై కలకత్తా, కేరళ హైకోర్టులు సంతృప్తి వ్యక్తం చేశాయనీ పేర్కొంది.

ఫిబ్రవరి 26న ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించినప్పుడు కేరళ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, అసోం, పుదుచ్చేరిల్లో కేసులు తక్కువగానే ఉన్నాయని తెలిపింది. కాబట్టి కేసుల విషయంలో కేవలం ఎన్నికల సంఘాన్ని తప్పుబట్టడం సరి కాదని వ్యాఖ్యానించింది.