బెంగాల్‌లో మేము ఓడిపోతామ‌ని వ‌చ్చిన ఎగ్జిట్ పోల్స్ స‌రికాదు.. అసోంలో గెలుస్తామ‌ని వ‌చ్చిన అంచ‌నాలు మాత్రం నిజం: బీజేపీ

30-04-2021 Fri 11:52
  • బెంగాల్‌లో ఓట‌ర్లు అభిప్రాయాల‌ను బ‌య‌ట‌కు స‌రిగ్గా చెప్ప‌లేరు
  • ఆ రాష్ట్రంలో  హింస ఎక్కువ‌
  • 2011లో వామ‌ప‌క్ష పార్టీలు అధికారంలోకి వ‌స్తాయ‌ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి
  • కానీ ఆ అంచనాలు నిజం కాలేదు
we will win in bengal also bjp

ప‌శ్చిమ బెంగాల్‌లోనూ నిన్నటితో ఎన్నిక‌లు ముగియ‌డంతో నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత ఎన్నిక‌ల ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డైన విష‌యం తెలిసిందే. ప‌శ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, అసోంలో బీజేపీ గెలుస్తాయ‌ని ఎగ్జిట్ పోల్స్ లో అంచ‌నాలు వెల్ల‌డ‌య్యాయి. అయితే, ప‌శ్చిమ బెంగాల్‌లో త‌మ పార్టీ ఓడుతుంద‌ని వ‌చ్చిన అంచ‌నాలు నిజం కాద‌ని, అసోంలో గెలుస్తుంద‌ని వ‌చ్చిన అంచ‌నాలు మాత్రం నిజ‌మేన‌ని  బీజేపీ నేతలు అంటున్నారు.  

బీజేపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప‌శ్చిమ బెంగాల్ ఇన్‌చార్జ్ కైలాష్ విజ‌య్ వ‌ర్ఘియా తాజాగా మీడియాతో మాట్లాడుతూ... ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించిన సంస్థ‌లు ప‌శ్చిమ‌ బెంగాల్‌లో ప్ర‌జ‌ల అభిప్రాయాన్ని స‌రైన రీతిలో రాబ‌ట్ట‌లేవ‌ని చెప్పారు. ఆ రాష్ట్రంలో హింస ఎక్కువ‌ని, అధికార పార్టీ టీఎంసీకి వ్య‌తిరేకంగా మాట్లాడే సాహసం చేయ‌రని చెప్పుకొచ్చారు.

ఆ రాష్ట్రంలో సైలెంట్ ఓట‌ర్లు ఎక్కువ‌ని చెప్పారు. 2011లోనూ ఇలాగే బెంగాల్‌లో వామ‌ప‌క్ష పార్టీలు అధికారంలోకి వ‌స్తాయ‌ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయ‌ని, కానీ  టీఎంసీ అధికారంలోకి వ‌చ్చింద‌ని తెలిపారు. బెంగాల్‌లో ప్ర‌తిపక్ష పార్టీల‌కు ఓట్లు వేసి వారు ఆ విష‌యాన్ని ధైర్యంగా బ‌య‌ట‌కు చెప్పలేరని వ్యాఖ్యానించారు.

అసోంలో తాము గెలుస్తామ‌ని వ‌చ్చిన అంచనాల‌ను మాత్రం ఆ పార్టీ స్వాగ‌తించింది.  ఆ రాష్ట్రంలో తాము చేసిన అభివృద్ధికి ప్ర‌జ‌లు మ‌ళ్లీ ప‌ట్టం క‌ట్ట‌బోతున్నార‌ని బీజేపీ అధికార ప్ర‌తినిధి కేకే శ‌ర్మ చెప్పుకొచ్చారు.