మిగిలిపోయిన టీకాలను తిరిగిచ్చేయండి... ప్రైవేట్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు కేంద్రం ఆదేశం

29-04-2021 Thu 21:42
  • మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా
  • మూడో విడత నుంచి అమల్లోకి రానున్న కొత్త ధరలు
  • కేంద్రం, రాష్ట్రాలు, ప్రైవేట్‌ ఆసుపత్రులకు భిన్న ధరలు
  • ప్రైవేట్‌ కేంద్రాల వ్యాక్సినేషన్‌పై వివరాలు సమర్పించాలని రాష్ట్రాలకు ఆదేశాలు
Centre asks private vaccination centres to return unutilised vaccines by tomorrow

ప్రైవేట్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో ఇప్పటి వరకు మిగిలిపోయిన టీకాలను రేపటి కల్లా తిరిగిచ్చేయాలని కేంద్రం ఆదేశించింది. మే 1 నుంచి ప్రారంభం కానున్న మూడో విడత వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో వాటిని వినియోగించొద్దని స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వ కేంద్రాల్లో మాత్రమే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగనుంది.

మే 1 నాటికి ప్రైవేటు కేంద్రాలు టీకాలను సమకూర్చుకునే సూచనలు కనిపించడం లేదు. దీంతో తయారీ సంస్థల నుంచి నేరుగా కొత్త వ్యాక్సిన్లను కొనుగోలు చేసే వరకు ప్రైవేట్‌ కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కొనసాగించే అవకాశం లేదు. ప్రైవేట్‌ కేంద్రాలకు అందించిన టీకాలు, వాటిలో ఏప్రిల్‌ 30 నాటికి వినియోగించిన డోసులు, వాటికి చెల్లించిన సొమ్ము వంటి తదితర వివరాలన్నింటినీ రాష్ట్ర/కేంద్ర పాలిత ప్రాంతాలు సేకరించాలని కేంద్రం కోరింది.

మూడో విడత వ్యాక్సినేషన్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్‌ ఆసుపత్రులు నేరుగా తయారీ సంస్థల వద్దే టీకాలు కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించింది కేంద్రం. దీంతో తయారీ సంస్థలు వేర్వేరు ధరల్ని నిర్ణయించాయి. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్‌ కేంద్ర ప్రభుత్వానికి ఒక్కో డోసును రూ.150, రాష్ట్రాలకు రూ.300, ప్రైవేట్‌ ఆసుపత్రులకు రూ.600 అందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇక భారత్‌ బయోటెక్‌ తమ కొవాగ్జిన్‌ టీకా ఒక్కో డోసును కేంద్రానికి రూ.150, రాష్ట్రాలకు రూ.400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.1200 విక్రయించాలని నిర్ణయించింది.

ఇప్పటి వరకు ఈ రెండు సంస్థలు కేవలం కేంద్రానికి మాత్రమే టీకాలను సరఫరా చేశాయి. ఒక్కో డోసును రూ.150 విక్రయించాయి. వాటిని కేంద్రం రాష్ట్రాలకు ఉచితంగా, ప్రైవేట్‌ ఆసుపత్రులకు కొన్న ధరకే అందించాయి. తాజాగా మే 1 నుంచి కొత్త నిబంధనలు, ధరలు అమల్లోకి రానున్న నేపథ్యంలో కేంద్రం మిగిలిపోయిన టీకాలను తిరిగిచ్చేయాలని ఆదేశించింది.