డ్యూక్స్ బంతులతో కోహ్లీకి బౌలింగ్ చేసేందుకు నిరాకరించిన కివీస్ పేసర్.. ఎందుకంటే..!

29-04-2021 Thu 21:21
  • ఐపీఎల్ లో రూ.15 కోట్ల ధర పలికిన కైల్ జేమీసన్
  • రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం
  • బెంగళూరుకు కెప్టెన్సీ వహిస్తున్న కోహ్లీ
  • ఈ ఏడాది జూన్ లో టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్
  • ఫైనల్స్ లో డ్యూక్ బంతుల వినియోగం
  • ప్రాక్టీసు అవుతుందని భావించిన కోహ్లీ
Kyle Jamieson denies to bowl Kohli with Dukes balls in the nets

ఐపీఎల్ 14వ సీజన్ లో రూ.15 కోట్ల ధర పలికిన న్యూజిలాండ్ పేసర్ కైల్ జేమీసన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. బౌలింగ్ మాత్రమే కాదు, బ్యాటింగ్ లో భారీ షాట్లు కొట్టడం జేమీసన్ ప్రత్యేకత. జేమీసన్ ఐపీఎల్ కోసం భారత్ కు వచ్చేటప్పుడు తనతో పాటు రెండు డ్యూక్స్ కంపెనీ బంతులను కూడా వెంట తెచ్చుకున్నాడు. అయితే ఆ బంతులతో విరాట్ కోహ్లీకి నెట్స్ లో బౌలింగ్ చేసేందుకు జేమీసన్ నిరాకరించాడు.

కోహ్లీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ అని తెలిసిందే. తన కెప్టెన్ అడిగినా డ్యూక్స్ బంతులతో నెట్స్ లో బౌలింగ్ చేసేందుకు జేమీసన్ నో చెప్పడానికి బలమైన కారణమే ఉంది.

ఈ ఏడాది జూన్ 18న ఇంగ్లండ్ లోని సౌతాంప్టన్ లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ జరగనుంది. ఈ మ్యాచ్ లో డ్యూక్స్ బంతులనే ఉపయోగిస్తారు. డ్యూక్స్ బంతులు విపరీతంగా స్వింగ్ అవుతాయి. ఆ మ్యాచ్ ను దృష్టిలో ఉంచుకునే కోహ్లీ... జేమీసన్ ను నెట్ బౌలింగ్ చేయాలని కోరాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగిందని ఆ సమయంలో అక్కడే ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు డాన్ క్రిస్టియన్ వెల్లడించాడు.

"ఐపీఎల్ ప్రారంభమైన తొలి వారంలో అనుకుంటా... మేం ముగ్గురం నెట్స్ వద్ద ఉన్నాం. కోహ్లీ, జేమీసన్ టెస్టు క్రికెట్ గురించి మాట్లాడుకుంటున్నారు. జేమీ, నువ్వు డ్యూక్స్ బంతులతో ఎక్కువగా బౌలింగ్ చేశావా? అని కోహ్లీ అడిగాడు. నాతో పాటు రెండు డ్యూక్స్ బంతులను తీసుకువచ్చాను. వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ కు వెళ్లే లోపు ఆ బంతులపై పట్టు సాధించాలనుకుంటున్నాను అని జేమీసన్ చెప్పాడు. అవునా... అయితే నెట్స్ లో నాకు డ్యూక్స్ బంతులతో బౌలింగ్ చేస్తావా? నెట్స్ లో నిన్ను ఎదుర్కోవడం కంటే సంతోషకరమైన విషయం మరొకటి ఉండదు అని కోహ్లీ తెలివిగా మాట్లాడాడు. కానీ, జేమీసన్ మాత్రం కోహ్లీ బుట్టలో పడలేదు. డ్యూక్స్ బంతులతో నీకు బౌలింగ్ చేసే ప్రశ్నే లేదు అంటూ కుండబద్దలు కొట్టేశాడు" అని డాన్ క్రిస్టియన్ వివరించాడు.