డికాక్ అదుర్స్... రాజస్థాన్ రాయల్స్ పై అలవోకగా గెలిచిన ముంబయి ఇండియన్స్

29-04-2021 Thu 19:19
  • ఢిల్లీలో ముంబయి, రాజస్థాన్ మ్యాచ్
  • 7 వికెట్ల తేడాతో నెగ్గిన ముంబయి ఇండియన్స్
  • 172 రన్స్ లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించిన వైనం
  • 70 పరుగులతో అజేయంగా నిలిచిన క్వింటన్ డికాక్
Mumbai Indians beat Rajasthan Royals by seven wickets

ఐపీఎల్ డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్ తన స్థాయికి తగిన ఆటతీరు ప్రదర్శించింది. ఢిల్లీ అరుణ్ జైట్లీ మైదానంలో రాజస్థాన్ రాయల్స్ పై ఈ సాయంత్రం జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 172 పరుగుల విజయలక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ 70 పరుగులతో అజేయంగా నిలవడం విశేషం. కృనాల్ పాండ్య 39 పరుగులు చేశాడు. పొలార్డ్ 16, సూర్యకుమార్ యాదవ్ 16, రోహిత్ శర్మ 14 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో క్రిస్ మోరిస్ కు 2, ముస్తాఫిజూర్ రెహ్మాన్ కు 1 వికెట్ లభించింది.

అంతకుముందు, టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసింది. కాగా, ఈ మ్యాచ్ లో విజయం సాధించిన అనంతరం ముంబయి ఇండియన్స్ పాయింట్ల పట్టికలో నాలుగోస్థానానికి చేరుకుంది.

ఇక, నేడు ఐపీఎల్ లో జరిగే రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.