సీరం బాటలో భారత్ బయోటెక్... కొవాగ్జిన్ ధర తగ్గింపు

29-04-2021 Thu 18:22
  • భారత్ లో ముమ్మరంగా కరోనా వ్యాక్సినేషన్
  • టీకాలకు భారీ డిమాండ్
  • నిన్ననే కొవిషీల్డ్ ధర తగ్గించిన సీరం
  • అదే తరహాలో ఉదారంగా స్పందించిన భారత్ బయోటెక్
  • రాష్ట్రాలకు రూ.400కే కొవాగ్జిన్
Bharat Biotech reduces Covaxin price for states

భారత్ లో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్లకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. అయితే ఊరట కలిగించే రీతిలో వ్యాక్సిన్ ఉత్పత్తిదారులు ధరలు తగ్గిస్తున్నారు. ఇప్పటికే సీరం ఇన్ స్టిట్యూట్ తన కొవిషీల్డ్ వ్యాక్సిన్ ధరను రూ.400 నుంచి రూ.300కి తగ్గించింది. తాజాగా, కొవాగ్జిన్ ఉత్పత్తిదారు భారత్ బయోటెక్ కూడా ధర తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. కొవాగ్జిన్ టీకాను రాష్ట్రాలకు రూ.400కే ఇస్తామని ఓ ప్రకటనలో తెలిపింది.

ధరల విషయంలో తాము పారదర్శకంగా వ్యవహరిస్తున్నట్టు పేర్కొంది. దేశంలోని వైద్య, ఆరోగ్య వ్యవస్థలు కరోనా పరిస్థితుల నడుమ ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు భారత్ బయోటెక్ వివరించింది.