నైట్ కర్ఫ్యూను పొడిగించిన తమిళనాడు ప్రభుత్వం... ఓట్ల లెక్కింపు రోజున పూర్తి లాక్ డౌన్

29-04-2021 Thu 17:01
  • తమిళనాడులో కరోనా బీభత్సం
  • ఈ నెల 20 నుంచి నైట్ కర్ఫ్యూ
  • ఇప్పటికీ అదుపులోకి రాని మహమ్మారి
  • తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు నైట్ కర్ఫ్యూ కొనసాగింపు
Tamilnadu govt extends night curfew

తమిళనాడులో కరోనా మహమ్మారి ఉద్ధృతి ఏమాత్రం అదుపులోకి రాకపోవడంతో నైట్ కర్ఫ్యూను మరింత పొడిగించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు తమిళనాడులో రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. రాత్రి 10 గంటల నుంచి వేకువజామున 4 గంటల వరకు కఠిన నిబంధనలతో కూడిన కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపింది.

ఇక, మే 2న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుండగా, ఆ రోజున రాష్ట్రంలో పూర్తి లాక్ డౌన్ అమలు చేస్తున్నట్టు తమిళనాడు ప్రభుత్వం వెల్లడించింది. అయితే కౌంటింగ్ రోజున అధికారుల తరలింపు, పార్టీ ప్రతినిధులు, అభ్యర్థులు, ఏజెంట్ల కదలికలు, కౌంటింగ్ సిబ్బందికి ఆహారం తరలింపు వంటి అంశాలపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవని తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

అంతేకాదు ఆదివారాల్లో సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించారు. బార్లు, క్లబ్ లు, జిమ్ లు, థియేటర్లు, ప్రార్థనా మందిరాలు, సమావేశ మందిరాలు మూసివేతకు ఆదేశాలిచ్చారు.

తమిళనాడులో గత 24 గంటల్లో 16,665 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క చెన్నైలోనే 4,764 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 98 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండడంతో ప్రభుత్వం ఈ నెల 20 నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి తీసుకువచ్చింది.