నన్ను, నా కుటుంబ సభ్యులను చంపేస్తామంటున్నారు: బీజేపీ శ్రేణులపై హీరో సిద్ధార్థ్ ఆరోపణలు

29-04-2021 Thu 16:12
  • 24 గంటల వ్యవధిలో 500 కాల్స్ వచ్చాయన్న సిద్ధార్థ్
  • ఆడవాళ్లపై అత్యాచారాలు చేస్తామంటున్నారని వెల్లడి
  • కాల్స్ రికార్డు చేశానని వివరణ
  • పోలీసులకు ఆధారాలు అందిస్తానని స్పష్టీకరణ
Hero Siddarth fires on Tamilnadu BJP

దక్షిణాది యువ హీరో సిద్ధార్థ్ తమిళనాడు బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు బీజేపీ, తమిళనాడు బీజేపీ ఐటీ విభాగం తన ఫోన్ నెంబర్ లీక్ చేశాయని, గత 24 గంటల వ్యవధిలో 500 వరకు కాల్స్ వచ్చాయని ఆరోపించారు. తనను, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరిస్తున్నారని, కుటుంబంలోని మహిళలపై అత్యాచారం చేస్తామని హెచ్చరిస్తున్నారని వెల్లడించారు. తన నెంబరు లీక్ చేయడమే కాకుండా, "వీడు మరోసారి నోరెత్తి మాట్లాడకుండా దాడులు చేయండి, వేధించండి" అంటూ ఇతరులను ఎగదోస్తున్నారని మండిపడ్డారు.

అన్ని కాల్స్ రికార్డు చేశానని, ఆ ఫోన్ నెంబర్లను పోలీసులకు అందిస్తున్నానని తెలిపారు. తన నోరు మూయించాలని ప్రయత్నిస్తే అది సాధ్యం కాదని, చేతనైతే ప్రయత్నాలు చేస్తూనే ఉండండి అని సిద్ధార్థ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. తన ఫోన్ నెంబరుతో కూడిన పోస్టులను కూడా సిద్ధార్థ్ పంచుకున్నారు.