ఇతర రాష్ట్రాల కంటే ముందు మద్యం దుకాణాలను తెరిచిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది: చంద్రబాబు

29-04-2021 Thu 14:17
  • కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది
  • ఆరోగ్యశ్రీ కిందకు కరోనా అనే జీవో అమలు కావడం లేదు
  • శవాలను మోటార్ సైకిళ్లపై తీసుకెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి
Chandrababu fires on YSRCP govt

కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వ చేతికానితనంతో ప్రజలు చనిపోతున్నారని... రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 25.9 శాతానికి చేరుకుందని అన్నారు. కోర్టులకు కూడా కరోనా గురించి తప్పుడు లెక్కలు చెపుతున్నారని దుయ్యబట్టారు. కరోనాను ఆరోగ్యశ్రీ కిందకు చేర్చామని ప్రభుత్వం చెపుతోందని... అయితే ఆ జీవోలు ఎక్కడా అమలు కావడం లేదని విమర్శించారు. ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరిస్తోందని అన్నారు.

మూడు గంటల్లో కరోనా పేషెంట్లకు బెడ్లు ఇస్తామని ప్రకటించుకున్నారని... ఎక్కడైనా ఇస్తున్నారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల కంటే ముందే మద్యం దుకాణాలను తెరిచిన ఘనత ఏపీ ప్రభుత్వానిదని దుయ్యబట్టారు. మోటార్ సైకిళ్లపై శవాలను తీసుకెళ్లాల్సిన దారుణ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని చెప్పారు.

దేశమంతా విద్యార్థులకు పరీక్షలను రద్దు చేస్తుంటే... ఏపీ ప్రభుత్వం మాత్రం మొండిగా పరీక్షలను నిర్వహించేందుకు సిద్ధమవుతోందని చంద్రబాబు విమర్శించారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకునే హక్కును మీకెవరిచ్చారని ప్రశ్నించారు. వ్యాక్సినేషన్ లో కూడా ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రూ. 10 వేలు వసూలు చేయాల్సిన వెంటిలేటర్ బెడ్ కు లక్షల్లో వస్తూలు చేస్తున్నారని విమర్శించారు.