కరోనా రావడంతో డెలివరీ చేయలేమన్నారు.. చాలా భయమేసింది: హరితేజ

29-04-2021 Thu 13:44
  • వారం రోజుల్లో డెలివరీ అనగా కరోనా వచ్చింది
  • ఆ తర్వాత కోవిడ్ సెంటర్లో చేరాను
  • పాపను కూడా నాకు దూరంగా ఉంచారు
Doctors refused to do delivery says Hariteja

తాను కరోనా బారిన పడ్డానని సినీ నటి హరితేజ తెలిపింది. ఇటీవలే ఆడబిడ్డకు జన్మనిచ్చిన హరితేజ... డెలివరీ సమయంలో తాను పడిన బాధలను వివరించింది. డెలివరీకి సరిగ్గా వారం రోజుల ముందు తనకు కరోనా సోకిందని చెప్పింది. వారం రోజుల ముందు ఆసుపత్రికి వెళ్లానని, వైద్య పరీక్షలను నిర్వహించిన డాక్టర్ బేబీ ఆరోగ్యంగా ఉందని, సాధారణ డెలివరీ అవుతుందని చెప్పడంతో చాలా సంతోషంగా ఫీల్ అయ్యానని తెలిపింది. బిడ్డ కోసం ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో తమ కుటుంబం మొత్తం కరోనా బారిన పడిందని... దీంతో ఎంతో కంగారు పడ్డానని చెప్పింది.

కరోనా నేపథ్యంలో డెలివరీ చేయడం కుదరదని డాక్టర్లు చెప్పారని... ఆ తర్వాత కోవిడ్ సెంటర్ లో చేరానని హరితేజ తెలిపింది. అయితే తన భర్తకు నెగెటివ్ నిర్ధారణ కావడంతో... ఆయన తనను చాలా జాగ్రత్తగా చూసుకున్నారని చెప్పింది. ఆ తర్వాత సర్జరీ చేసి బేబీని తీశారని... చిన్నారికి నెగెటివ్ రావడంతో తనకు దూరంగా ఉంచారని తెలిపింది. పాపకు పాలు కూడా ఇవ్వలేని పరిస్థితిని అనుభవించానని చెప్పింది. వీడియో కాల్స్ ద్వారా బేబీని చూసుకునేదాన్నని తెలిపింది. తాను ఎంతో బాధను అనుభవించానని చెప్పింది. దేవుడి దయవల్ల తమ ఇంట్లో అందరికీ నెగెటివ్ వచ్చిందని తెలిపింది.