భారత్​ కు వీలైనంత త్వరగా 25 వేల ఆక్సిజన్​ కాన్సంట్రేటర్లు: చైనా

29-04-2021 Thu 12:55
  • అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారని వెల్లడి
  • కార్గో విమానాలు ప్రణాళికలు రెడీ చేస్తున్నాయని కామెంట్
  • భారత్ లో చైనా రాయబారి సన్ వీడాంగ్ ట్వీట్
Working Overtime To Supply 25000 Oxygen Concentrators To India says China

భారత్ కు ఆక్సిజన్ పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చైనా ప్రకటించింది. అందుకు అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పింది. ఈ మేరకు భారత్ లో చైనా రాయబారి సన్ వీడాంగ్ ట్వీట్ చేశారు.

‘‘భారత్ నుంచి వచ్చిన ఆర్డర్లను త్వరితగతిన అందించేందుకు మా వైద్య సరఫరాల అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఇటీవలి కాలంలో 25 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లకు భారత్ ఆర్డర్ పెట్టింది. వైద్య సరఫరాలను తీసుకొచ్చేందుకు కార్గో విమానాలు ప్రణాళికలు వేసకుంటున్నాయి. అందుకు అనుగుణంగా చైనా కస్టమ్స్ అధికారులు విధి విధానాలను నిర్ణయిస్తారు’’ అని ఆయన ట్వీట్ చేశారు.

అయితే, అంతకుముందు 15 రోజుల పాటు భారత్ కు కార్గో విమానాలన్నింటినీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించి చైనా తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. ఆ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తడంతో నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. భారత్ కు సాయం చేస్తున్నట్టు ప్రకటించడంతో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను వీలైనంత త్వరగా పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని సన్ చెప్పారు.