తెలంగాణ‌లో రేపటితో రాత్రిపూట కర్ఫ్యూ ముగుస్తుంది.. ఆ త‌ర్వాత తీసుకోబోతున్న‌ చర్యలేంటి: ప‌్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన హైకోర్టు

29-04-2021 Thu 12:49
  • తెలంగాణ‌లో కరోనా పరిస్థితులపై విచారణ
  • ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై ఆగ్ర‌హం
  • క‌ర్ఫ్యూ అంశంపై రేపు నిర్ణయం తీసుకుంటామన్న‌ ప్రభుత్వం
  • చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఏంట‌న్న హైకోర్టు
  • కనీసం ఒకరోజు ముందు చెబితే వ‌చ్చే నష్టమేంటని ప్ర‌శ్న‌
trial in high court on elections corona

తెలంగాణ‌లో కరోనా పరిస్థితులపై విచారణ జరిపిన హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ప‌లు కార్పొరేష‌న్లు, మునిసిపాలిటీల‌ ఎన్నిక‌లకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధ‌మైన వేళ ఈ అంశాన్ని ప్ర‌స్తావించింది. క‌రోనా వేళ‌ ఎన్నికలకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించింది.

ప్రజల ప్రాణాలు విలువైనవా? ఎన్నికలా? అని నిల‌దీసింది. ఒక‌వేళ‌ యుద్ధం వచ్చినప్ప‌టికీ, ఆకాశం విరిగి మీద పడినప్ప‌టికీ ఎన్నికలు జరగాల్సిందేనా? అని ఎస్‌ఈసీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.  కొన్ని మునిపాలిటీల్లో ఎన్నిక‌ల‌కు ఇంకా సమయం ఉందని గుర్తు చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతోనే ఎన్నికలు నిర్వహిస్తున్న‌ట్లు ఎస్‌ఈసీ అధికారులు చెప్పారు.

అయిన‌ప్ప‌టికీ, కరోనా రెండో దశ ప్రార‌భ‌మైనా నోటిఫికేషన్‌ ఎందుకు ఇచ్చారని ప్ర‌శ్నించింది. ఎన్నికలు వాయిదా వేసే అధికారం ఎస్‌ఈసీకి లేదా? అని నిల‌దీసింది. ఎస్‌ఈసీ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని తెలిపింది. ఈ విష‌యంపై వివ‌ర‌ణ ఇచ్చేందుకు అధికారులు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

అస‌లు ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వ అభిప్రాయం అడగాల్సిన అవసరం ఏంటని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితుల‌పై కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసింది. రేపటితో రాత్రిపూట కర్ఫ్యూ ముగుస్తుందని, అనంత‌రం తీసుకోబోతున్న‌ చర్యలేంటని కోర్టు ప్రశ్నించింది. పరిస్థితిని సమీక్షించి రేపు నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం సమాధానమివ్వ‌డంతో దీనిపై కోర్టు మండిప‌డింది.

చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఏంట‌ని నిల‌దీసింది. క‌ర్ఫ్యూ వంటి విష‌యాల‌ను కనీసం ఒకరోజు ముందు చెబితే వ‌చ్చే నష్టమేంటని ప్ర‌శ్నించింది. దీంతో ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి మధ్యాహ్నంలోగా వివ‌రాలు చెబుతామ‌ని ఏజీ కోర్టుకు తెలిపారు.