Maharashtra: తగ్గని కరోనా ప్రభంజనం.. లాక్ డౌన్, కఠిన నిబంధనలను పొడిగించనున్న మహారాష్ట్ర!

  • లాక్ డౌన్ కొనసాగింపుపై మహారాష్ట్ర కేబినెట్ సమావేశంలో చర్చ
  • మరో 15 రోజుల పాటు లాక్ డౌన్ ను కొనసాగించే అవకాశం
  • రేపటి లోగా ఆదేశాలు వెలువడే అవకాశం
Maharashtra to extend lockdown

మన దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. దీంతో, కరోనాను కట్టడి చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30 వరకు లాక్ డౌన్ ను విధించింది. అయినప్పటికీ కరోనా కట్టడి కాకపోవడంతో లాక్ డౌన్ మరో 15 రోజుల పాటు పొడిగించే ఆలోచనలో మహా ప్రభుత్వం ఉంది. అదే జరిగితే మే 15 వరకు మహారాష్ట్రలో లాక్ డౌన్ ఉండబోతోంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే సూచనప్రాయంగా తెలియజేశారు.

నిన్న మహారాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. లాక్ డౌన్ ను పొడిగించడంపై ఈ సమావేశంలో చర్చించారు. రేపటి లోగా లాక్ డౌన్ కొనసాగించడంపై ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది. లాక్ డౌన్ సమయంలో ప్రజల కదలికలపై కఠినమైన ఆంక్షలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇతర కార్యక్రమాలు, వేడుకలపై పూర్తి నిషేధం ఉండనుంది. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది.

ఈ సందర్భంగా రాజేశ్ తోపే మాట్లాడుతూ, ప్రభుత్వ చర్యలతో కరోనా వ్యాప్తిలో కొంత స్థిరత్వం వచ్చిందని తెలిపారు. గతంలో రోజువారీ కొత్త కేసుల సంఖ్య 70 వేలను దాటేదని... ఇప్పుడు 60 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ఇప్పటి నుంచి కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్ కఠిన నిబంధనలు కొనసాగించాలని కేబినెట్ సమావేశంలో మంత్రులందరూ అభిప్రాయపడ్డారని చెప్పారు.

More Telugu News