టాటా మోటార్స్ నుంచి డిజైన్ హెడ్ ప్రతాప్ బోస్ రాజీనామా!

29-04-2021 Thu 12:04
  • టాటా నెక్సన్ ను డిజైన్ చేసిన ప్రతాప్ బోస్
  • టియాగో, టిగోర్, హెక్సా వెనుక కూడా కృషి
  • కొత్త డిజైన్ హెడ్ గా మార్టిన్ ఉహ్లారిక్
Tata Motors Design Head Pratap Resigns

భారత మార్కెట్లో ఎంతో విజయవంతమైన టాటా నెక్సన్ వంటి కార్లను డిజైన్ చేసిన సంస్థ చీఫ్ డిజైనర్, డిజైన్ విభాగం హెడ్ ప్రతాప్ బోస్ సంస్థను వీడారు. ఆయన తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నానని, టాటా మోటార్స్ కు రాజీనామా చేశానని వెల్లడించగా, ఈ మేరకు సంస్థలో ఇంటర్నల్ మెమో జారీ అయింది. "మరింత మెరుగైన అవకాశాల కోసం ప్రతాప్ బోస్ సంస్థను వీడాలని నిర్ణయించుకున్నారు. ఆయన మిగతా పదవీ కాలాన్ని సెలవు కాలంగా పరిగణించాలని నిర్ణయించాం. ప్రస్తుతం యూకే డిజైన్ సెంటర్ హెడ్ గా ఉన్న మార్టిన్ ఉహ్లారిక్ కు ఈ బాధ్యతలను అప్పగించాం" అని సంస్థ పేర్కొంది.

కాగా, ప్రస్తుతం ప్రతాప్ బోస్ నోటీస్ పీరియడ్ లో ఉన్నారని, అయితే, ప్రస్తుతం జరుగుతున్న ప్రాజెక్టుల్లో ఆయన తనవంతు సహకారాన్ని అందిస్తారని టాటా మోటార్స్ వెల్లడించింది. "మార్టిన్ ను హెడ్ ఆఫ్ ది డిజైన్ గా నియమించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆటోమొబైల్ డిజైనర్ గా ఆయనకు ఉన్న అపారమైన అనుభవం కొత్త మోడల్ కార్లను ప్రపంచానికి అందిస్తుంది. అంతర్జాతీయ ట్రెండ్స్ ఎలా ఉన్నాయన్న విషయంతో పాటు నిర్వహణా అనుభవం విషయంలో మార్టిన్ కు ఎంతో అనుభవం ఉంది. డిజైన్ ఫిలాసఫీ, లాంగ్వేజ్ విషయంలో సంస్థ మరో అడుగు ముందుకు వేసింది. ఇదే సమయంలో ప్రతాప్ సంస్థకు చేసిన సర్వీస్ కు కృతజ్ఞతలు. ఆయన భవిష్యత్తు బాగుండాలి" అని టాటా మోటార్స్ ఎండీ అండ్ సీఈఓ గ్యుంటర్ బుట్స్ చెక్ వ్యాఖ్యానించారు.

ఇదిలావుండగా, గతంలో ప్రతాప్ బోస్ ఆటోమోటివ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ సహా పలు అవార్డులను అందుకున్నారు. ఆయన సాధించిన విజయాలు సంస్థకు ఎంతో మేలు కలిగించాయి. గడచిన నాలుగేళ్లుగా సంస్థ అందించిన నూతన మోడల్స్ వెనుక ప్రతాప్ కృషి ఎంతో ఉందని సంస్థ వర్గాలే అంగీకరించాయి. టియాగో హ్యాచ్ బ్యాక్, టిగోర్, హెక్సా, ఆల్ట్రోజ్ ఈవీ తదితర మోడల్స్ తయారీలో ఆయన సలహాలు, సూచనలను సంస్థ యాజమాన్యం పాటించి, విజయవంతమైన మోడల్స్ ను మార్కెట్లోకి తెచ్చింది.