తాడేప‌ల్లిలోని నివాసంలో కూర్చొని జ‌గ‌న్ ఐపీఎల్ మ్యాచులు, సినిమాలు చూస్తున్నారు: దేవినేని ఉమ‌

29-04-2021 Thu 11:50
  • క‌రోనా ఉద్ధృతి రోజురోజుకీ పెరిగిపోతోంది
  • పాలనను జ‌గ‌న్ గాలికొదిలేశారు
  • దమ్ముంటే ప్రభుత్వ ఆసుప‌త్రుల‌ను సందర్శించాలి
  • కరోనాతో ప్రజలు మృతి చెందుతున్నారు
devineni uma slams jagan

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మ‌హేశ్వ‌ర‌రావు మండిప‌డ్డారు. ఈ రోజు మంగ‌ళ‌గిరిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో క‌రోనా ఉద్ధృతి రోజురోజుకీ పెరిగిపోతుంటే దాన్ని ప‌ట్టించుకోకుండా ప్ర‌త్య‌ర్థుల‌పై త‌ప్పుడు కేసులు పెట్ట‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నార‌ని ఆరోపించారు. ముఖ్య‌మంత్రి జగన్‌ మాటలను మార్ఫింగ్‌ చేశారనే ఆరోపణలపై తనపై తప్పుడు కేసులు పెట్టార‌ని చెప్పారు.  

పాలనను జ‌గ‌న్ గాలికొదిలేశారని ఆయ‌న విమ‌ర్శించారు. కరోనా విజృంభ‌ణ వేళ‌ సీఎం జ‌గ‌న్ కు దమ్ముంటే విజయవాడ, గుంటూరులో ప్రభుత్వ ఆసుప‌త్రుల‌ను సందర్శించాలని డిమాండ్ చేశారు. వైసీపీ స‌ర్కారు మానవత్వం లేకుండా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, కరోనాతో ప్రజలు మృతి చెందుతోంటే సీఎం జగన్ మాత్రం తాడేపల్లిలోని నివాసంలో కూర్చొని ఐపీఎల్ మ్యాచ్‌లు, సినిమాలు చూస్తున్నారని ఆయ‌న ఆరోపించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉందని ఆయ‌న చెప్పారు. త‌న‌ను జైలులో పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటానని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.