'నారప్ప' రిలీజ్ డేట్ వాయిదా!

29-04-2021 Thu 11:32
  • తమిళంలో హిట్ కొట్టిన 'అసురన్'
  • ఓ పేద రైతు చుట్టూ తిరిగే కథ
  • మంజూ వారియర్ పాత్రలో ప్రియమణి

Narappa release is postponed

వెంకటేశ్ కథానాయకుడిగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' సినిమా రూపొందింది. ఈ సినిమాను మే 14వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా తీవ్రరూపం దాల్చడంతో చాలా సినిమాలు విడుదల తేదీలను వాయిదా వేసుకున్నాయి. ఈ నేపథ్యంలో 'నారప్ప' సినిమా విడుదల కూడా వాయిదాపడే అవకాశాలు ఉన్నాయనే టాక్ వచ్చింది. అనుకున్నట్టుగానే ఈ సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు. ఆ విషయాన్ని కొంతసేపటి క్రితం అధికారికంగా తెలియజేశారు. పరిస్థితులు అనుకూలించిన తరువాతనే 'నారప్ప' థియేటర్లకు వస్తాడనే విషయాన్ని స్పష్టం చేశారు.

తమిళంలో ధనుశ్ కి హిట్ తో పాటు ప్రశంసలను కూడా తెచ్చిపెట్టిన 'అసురన్' సినిమాకి ఇది రీమేక్. తమకి గల కొద్దిపాటి భూమిని నమ్ముకుని కథనాయకుడి కుటుంబం బ్రతుకుతూ ఉంటుంది. ఆ భూమిని అన్యాయంగా సొంతం చేసుకోవడానికి ఒక అవినీతిపరుడు ప్రయత్నిస్తాడు. రాజకీయపరమైన అండదండలతో ఆ రైతు కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేయాలనుకుంటాడు. అప్పుడు కథానాయకుడు ఏం చేస్తాడు? పర్యవసానంగా జరిగేదేమిటి? అనేదే కథ. తమిళంలో మంజూ వారియర్ చేసిన పాత్రలో తెలుగులో ప్రియమణి కనిపించనుంది.