Apple: అంచనాలను మించకున్నా పెరిగిన యాపిల్ నికర లాభం!

  • జనవరి - మార్చి త్రైమాసికంలో 23.6 బి. డాలర్ల నెట్ ప్రాఫిట్
  • 54 శాతం పెరిగి 90 బిలియన్ డాలర్లకు చేరిన ఆదాయం
  • మాక్, ఐపాడ్ అమ్మకాలు పెరిగాయన్న టిమ్ కుక్
Apple Net Profit Soars in First Quarter

ఐఫోన్లకు తోడు యాపిల్ ఇతర ఉత్పత్తులకు గణనీయంగా పెరిగిన డిమాండ్ జనవరి - మార్చి త్రైమాసికంలో సంస్థ నికర లాభాన్ని భారీగా పెంచింది. విలాసవంతమైన స్మార్ట్ ఫోన్లను కోరుకుంటున్న కస్టమర్లు యాపిల్ ఉత్పత్తులను అధికంగా కొంటుండటమే ఇందుకు కారణం. ఇక ఈ మూడు నెలల కాలంలో సంస్థకు 23.6 బిలియన్ డాలర్ల నికర లాభం (ఒక్కో ఈక్విటీకి 1.40 డాలర్లు) వచ్చింది. ఇదే సమయంలో మొత్తం ఆదాయం 54 శాతం పెరిగి 89.6 బిలియన్ డాలర్లకు పెరిగిందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

కాగా, అంతకుముందు ఆర్థిక నిపుణులు వేసిన అంచనాల ప్రకారం, సంస్థ ఒక్కో ఈక్విటీపై 99 సెంట్ల వరకూ లాభం వస్తుందని అంచనా వేశారు. అంచనాలను అధిగమించనప్పటికీ, సంస్థ నమోదు చేసిన నెట్ ప్రాఫిట్ సంతృప్తికరమేనని విశ్లేషకులు వ్యాఖ్యానించారు.

ఇదిలావుండగా, ఐఫోన్ 12 వేరియంట్ లో విడుదలైన నాలుగు వేరియంట్ల అమ్మకాలు అంత తృప్తికరంగా లేవని, ఇదే సమయంలో గత పండగ సీజన్ లో ఐఫోన్, యాపిల్ ప్రొడక్టుల అమ్మకాలు 66 శాతం పెరిగి 47.9 బిలియన్ డాలర్లకు చేరాయని, ఒక్క ఐ ఫోన్ తాజా వేరియంట్ అమ్మకాలు ఇందులో 17 శాతమని సంస్థ పేర్కొంది. ఐఫోన్ 6 వేరియంట్ మార్కెట్లోకి వచ్చిన 2014 సంవత్సరంతో పోలిస్తే, ఐఫోన్ 12 మార్కెట్లోకి వచ్చిన తరువాత అమ్మకాలు ఆల్ టైమ్ రికార్డును సృష్టిస్తాయని భావించినా, ఆ రికార్డు మాత్రం దక్కలేదు.

చాలా దేశాల్లో 5 జీ నెట్ వర్క్ అందుబాటులోకి రాకపోవడంతోనే, ఆ టెక్నాలజీకి సరిపడేలా తయారైన 12వ తరం స్మార్ట్ ఫోన్ అమ్మకాలు నమోదు కాలేదని, ఇదే సమయంలో పాత వర్షన్ ల అమ్మకాలు మాత్రం పెరిగాయని తెలుస్తోంది. ఇక యాపిల్ మాక్ అమ్మకాలు 70 శాతం పెరిగి 9.1 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అందివ్వగా, ఐపాడ్ అమ్మకాలు 79 శాతం పెరిగి 7.8 బిలియన్ డాలర్ల రెవెన్యూను అందించాయని యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ వ్యాఖ్యానించారు. ఎయిర్ ట్యాగ్స్, కంప్యూటర్స్, టాబ్లెట్ ల అమ్మకాలు పెరిగాయని ఆయన అన్నారు.

More Telugu News