టీకాతో దుష్ప్రభావాలు నలుగురిలో ఒక్కరికే.. అది కూడా ఒకటి రెండు రోజులే!

29-04-2021 Thu 09:40
  • టీకాలపై భయం అవసరం లేదు
  • టీకా వేయించుకుంటే కొవిడ్ నుంచి రక్షణ
  • కింగ్స్ కాలేజ్ లండన్ అధ్యయనంలో వెల్లడి
There is no side effects with corona vaccine

కరోనా టీకాతో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువంటూ వస్తున్న వార్తలు నిజం కాదని తాజా అధ్యయనం ఒకటి తేల్చి చెప్పింది. దుష్ప్రభావాలకు భయపడుతున్న చాలామంది టీకా వేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లోని కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం సైడ్ ఎఫెక్ట్స్‌పై ప్రచారంలో ఉన్న వార్తలను కొట్టిపడేసింది. అధ్యయనంలో భాగంగా కొవిషీల్డ్, ఫైజర్ టీకాలు వేయించుకున్న 6.27 లక్షల మంది నుంచి వివరాలు సేకరించి విశ్లేషించారు. ఈ రెండు టీకాలను తీసుకున్న నలుగురిలో ఒక్కరిలో మాత్రమే తలనొప్పి, అలసట, వికారం వంటి స్వల్ప సమస్యలు కనిపిస్తున్నాయని, అవి కూడా ఒకటి రెండు రోజుల్లోనే మాయం అవుతున్నట్టు అధ్యయనకారులు పేర్కొన్నారు.

కాబట్టి టీకా సైడ్ ఎఫెక్ట్స్‌పై అనవసర భయాలు అవసరం లేదని స్పష్టం చేశారు. టీకా తీసుకున్న తర్వాత 12-21 రోజుల మధ్య కొవిడ్ ముప్పు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నట్టు తేలింది. పైజర్ టీకా తీసుకున్న వారిలో 58 శాతం, కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో 39 శాతం కొవిడ్ రిస్క్ తగ్గినట్టు గుర్తించారు. మూడు వారాల తర్వాత  ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 69 శాతం, కొవిషీల్డ్ తీసుకున్న వారిలో 60 శాతం ముప్పు తగ్గినట్టు అధ్యయనకారులు గుర్తించారు.